కరోనా వైరస్ ధాటికి బ్రెజిల్ కూడా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వైరస్ కట్టడిలో అధ్యక్షుడు జైర్ బోల్స్‌నారో విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు కొవిడ్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఆయనపై కేసు నమోదు అయ్యింది.
బ్రెజిల్‌లోని మారన్‌హవో రాష్ట్రంలో కొవిడ్ కట్టడి ఆంక్షల్లో భాగంగా వందమందికిపైగా పాల్గొనే సమావేశాలపై నిషేధం ఉంది. అంతేకాకుండా మాస్కు ధరించని వారిపై చర్యలు సైతం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్‌హవో రాజధాని సావో లూయిస్ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్కు కూడా ధరించలేదు. అంతేకాకుండా కొవిడ్ ఆంక్షలను అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేతను 'చబ్బీ డిక్టేటర్' అంటూ సంబోధించారు.
దీనిపై మారన్‌హవో రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించారు. స్థానికంగా ఉన్న కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందున అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని స్పష్టంచేశారు. అయితే, అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినప్పటికీ దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు 15 రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం జరిమానా విధించే అవకాశాలున్నాయి.