లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆదివారం నుంచి సోమవారం మధ్య 24 గంటల్లో ఆ దేశంలో ఏకంగా 15,800కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 3.65 లక్షలు దాటింది.
కొవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా అక్కడ 653 మంది కరోనా తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో కొవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గత 14 రోజుల్లో బ్రెజిల్‌లో పర్యటించినవారెవర్నీ తమ దేశంలోకి అనుమతించబోమని ప్రకటించింది.
అమెరికన్లకు మినహాయింపు..
గురువారం నుంచి అమల్లోకి వచ్చే ఈ నిషేధాజ్ఞ నుంచి అమెరికా పౌరులకు మాత్రం మినహాయింపునిస్తున్నట్లు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. చైనా, ఐరోపా, బ్రిటన్, ఐర్లాండ్, ఇరాన్‌ల నుంచి విదేశీయుల రాకపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించిన సంగతి గమనార్హం.
అగ్రస్థానంలో..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా దాదాపు 17 లక్షల కేసులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్ ఉన్నాయి. భారత్ పదో స్థానంలో ఉంది.
రష్యాలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ 24 గంటల్లో దాదాపు 9 వేల కేసులు, 92 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.5 లక్షలు దాటింది.
చైనాలో తాజాగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 40 అసింప్టమాటిక్ కేసులు. కొత్తగా నిర్ధరణ అయిన బాధితుల్లో ఎవ్వరికీ దేశీయంగా వైరస్ సోకలేదని ప్రభుత్వం తెలిపింది. తాజా అసింప్టమాటిక్ బాధితుల్లో 38 మంది వుహాన్‌కు చెందినవారే కావడం గమనార్హం.
సడలింపులు..
మరోవైపు, నిషేధాజ్ఞల సడలింపు నేపథ్యంలో అమెరికాలో జనం బీచ్‌లకు పోటెత్తుతున్నారు. భౌతిక దూరం ప్రమాణాలను వారు పట్టించుకోవడం లేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా దెబ్బకు ఇన్నాళ్లూ కుదేలైన స్పెయిన్‌లో నిషేధాజ్ఞల ఎత్తివేత ప్రక్రియలో తొలి దశ ప్రారంభమైంది. మ్యాడ్రిడ్, బార్సిలోనా సహా పలు నగరాల్లో రెస్టారెంట్లు, బార్లు సోమవారం తెరుచుకున్నాయి.
మలేరియా మందుపై క్లినికల్ పరీక్షల నిలిపివేత..
కరోనా బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తూ వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న క్లినికల్ పరీక్షల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. కొవిడ్-19 బాధితులకు ఈ మందు వాడితే వారు మరణించే ముప్పు ఉంటుందని ఒక అధ్యయనం చెప్పగా ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు.