తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మక నగరం ఇది!

జనాభా పెరిగిపోయింది. ట్రాఫిక్‌ పెరిగింది. రవాణా సమస్యగా మారింది. ఇళ్లు ఇబ్బందిగా మారాయి. నిరక్షరాస్యత, నిరుద్యోగం, కాలుష్యం, పేదరికం, పెరిగిపోయిన బస్తీలు.. ఇలా సమస్యలన్నీ ఆ పట్టణంలో ముసురుకున్నాయి. అయితే.. ఇవన్నీ గతం. ఇప్పుడు అదే పట్టణం.. ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మకమైందిగా పేరు సంపాదించుకుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? ఈ మార్పు ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!

brazil curibita is the best innovative city in the world
ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మకమైన నగరం ఇది!

By

Published : Dec 7, 2020, 6:39 AM IST

Updated : Dec 7, 2020, 8:37 AM IST

క్రిస్టియానో పెరీరా వయసు పదేళ్లు! సెలవుల తర్వాత పాఠశాల ఆ రోజే మొదలైంది. రేపట్నుంచి నోట్‌ పుస్తకాలు తెచ్చుకోవాలని చెప్పారు టీచర్‌! సరేనన్న క్రిస్టియానో... ఇంట్లోని చెత్తబ్యాగు తీసుకెళ్లి అమ్మి... 8 పౌండ్లతో కొత్త పుస్తకాలు కొనుకున్నాడు.

అంతేకాదు... ప్రతివారం క్రిస్టియానో, అతని సోదరుడు ఇంట్లోని చెత్తనిచ్చి... తాజా పండ్లు తెచ్చుకుంటారు! అదొక్కటే కాదు... చాక్లెట్లు... కేకులు ఏది కావాలన్నా ఇంట్లో చెత్త తీసుకుపోవటం... కావల్సినవి తెచ్చుకోవటం మామూలే వాళ్లకు! చెత్త తీసుకుపోవటమేంటి... వస్తువులు తీసుకురావటమేంటి అనుకుంటున్నారా? అదే మరి... బ్రెజిల్‌లోని క్యురిటిబా పట్టణ విశిష్టత!

చెత్త ఒక్కటే కాదు... పాడుబడ్డ బస్సుల్లో మొబైల్‌ క్లాసులు నడపటం, మూతపడిన ఫ్యాక్టరీని థియేటర్‌ చేయటం, ఇళ్లలోని పాత కర్రలు, దూలాలు, ఇతర సామగ్రిని ఆఫీసుల్లో, దుకాణాల్లో, పార్కుల్లో తిరిగి ఉపయోగించటం... ఇలా చాలానే ఉన్నాయి! అందుకే ఈ క్యురిటిబాకు ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మక పట్టణంగా పేరొచ్చింది!

చెత్త ఇస్తారు.. పండ్లు తీసుకెళతారు

1970ల దాకా చాలా పట్టణాల మాదిరిగానే అనేక సమస్యలతో చెత్తకుప్పగా ఉన్న ఈ నగరం... ఓ పట్టుదల గల మేయర్‌ కారణంగా ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా మారిపోయింది! ఆధునిక పట్టణ ప్రణాళికలో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ, అర్బన్‌ ప్లానర్లు, ప్రపంచంలోని మేయర్లంతా వరుస కట్టి వచ్చి సందర్శించే స్థాయికి ఎదిగింది!

క్యురిటిబాకూ సమస్యలుండేవి..

జనాభా పెరిగిపోయింది.. ట్రాఫిక్‌ పెరిగింది... రవాణా సమస్యగా మారింది... ఇళ్లు ఇబ్బందిగా మారాయి...నిరక్షరాస్యత...నిరుద్యోగం... కాలుష్యం... పేదరికం... పెరిగిపోయిన బస్తీలు...ఇలా సమస్యలన్నీ ముసురుకున్నాయి... ఇవన్నీ గతం. ఇప్పుడు ఈ నగరం రూపు రేఖలు మారిపోయాయి.

  • చెత్త ఇక్కడ చెత్తకాదు... దాన్ని రీసైక్లింగ్‌ చేసి తిరిగి ఏదోరకంగా ఉపయోగిస్తారు.
  • అందుకే ఈ పట్టణాన్ని ప్రపంచ రీసైక్లింగ్‌ రాజధానిగా పిలుస్తారు.
  • ఈ రీసైక్లింగ్‌ విధానం పట్టణాన్ని శుభ్రంగా ఉంచటమే కాకుండా... ఇక్కడి పేదలకు ఉపాధిగా మారింది.
  • శుభ్రత పుణ్యమా అని రోగాలు తగ్గాయి. అన్నింటికి మించి... పట్టణంలోని నదుల్లో చెత్త పేరుకుపోయి వచ్చే వరదలు తగ్గిపోయాయి.

ఆదర్శం ఆ రవాణా

క్యురిటిబాలో రవాణా వ్యవస్థ
  • పల్లెల నుంచి భారీస్థాయిలో ప్రజలు ఈ పట్టణానికి వలస రావటంతో జనాభా విపరీతంగా పెరిగి... రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. సబ్‌వే, మెట్రోల్లాంటివి అవసరమయ్యాయి. కానీ భారీ బడ్జెట్‌తో కూడుకున్న వాటిని భరించే స్థోమత పట్టణానికి లేదు.
  • దీంతో 1991లో రోడ్లపైనే సబ్‌వేలు నిర్మించారు. అద్దాలతో గొట్టాల్లాంటి దారులు ఏర్పాటు చేశారు. వాటి పక్కనుంచే బస్సులు వెళ్లేలా (ఎక్కువ మందిని తీసుకెళ్లేలా పొడవైన బస్సులు, బస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌-బీఆర్‌టీ)... ఎక్కడంటే అక్కడ బస్సులెక్కేలా గొట్టాలకు ద్వారాలు ఏర్పాటు చేశారు.
  • ఈ బీఆర్‌టీ పద్ధతిని తర్వాత ప్రపంచంలో 300 పట్టణాల్లో అనుసరిస్తున్నారు.
  • బ్రెజిల్‌లోని బ్రసీలియాలాంటి పట్టణాలతో పోలిస్తే... క్యురిటిబాలో ఎక్కువ కార్లున్నా... 85 శాతం ప్రజలు ఈ ప్రజారవాణానే ఉపయోగిస్తారంటే అదెంత సౌకర్యవంతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
  • యావత్‌ బ్రెజిల్‌ తలసరి పెట్రోలు వినియోగంతో పోలిస్తే ఇక్కడ వినియోగం 25 శాతం తక్కువ.

కాదేదీ వృథా ఇక్కడ...

  • స్థానిక ఉదాహరణలతోనే పిల్లలకు చదువు చెబుతారు.
  • బంగారం, వజ్రాలు విలువైనవే... కానీ వాటికంటే గాజు ఇంకా విలువైందని పిల్లలకు చెబుతారు. కారణం... రీసైక్లింగ్‌కు అవకాశం ఉంది కాబట్టి!
  • రీసైక్లింగ్‌ ద్వారా ఎంత ఆదా చేయొచ్చో ప్రశ్నలడుగుతూ లెక్కలు నేర్పిస్తారు.
  • క్యురిటిబా నేర్పిన పాఠాలు... అంటూ మేయర్‌ రాసిన నాలుగు సంపుటాల పుస్తకం... ప్రతి బడిలో పిల్లలు చదవాల్సిందే.
  • 1991లో క్యురిటిబాలో పర్యావరణంపై ఓ ఉచిత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఇంట్లోని పాత వస్తువులను ఎలా తిరిగి సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో ఇక్కడ నేర్పిస్తారు. గృహిణులు, గుత్తేదార్లు, వ్యాపారవేత్తలు, టాక్సీ డ్రైవర్లు... ఇలా ప్రతిఒక్కరికీ ఇందులో శిక్షణ ఇస్తారు.
  • నిరుద్యోగాన్ని తగ్గించటానికి కూడా ఇక్కడ అనేక సృజనాత్మక విధానాలు అనుసరిస్తారు.
  • బడి పిల్లలు ఇంట్లో, స్కూల్లో కూరగాయలు పండించి అమ్ముతారు. వృత్తివిద్య నేర్చుకుని పనులు చేస్తూ సంపాదిస్తారు.

లైట్‌హౌస్‌ లెర్నింగ్‌...

ఓడలు, పడవలకు మార్గదర్శనం చేయటంలో ఉపయోగపడే లైట్‌హౌస్‌ల స్ఫూర్తితో ప్రజలకు చుక్కానిలా నిలిచే లైట్‌హౌస్‌ లైబ్రరీలను నెలకొల్పింది క్యురిటిబా!

క్యురిటిబాలో లైట్​హౌస్​
  • గ్రౌండ్‌ఫ్లోర్‌లో లైబ్రరీ... పైన లైట్‌హౌస్‌! కింద పుస్తకాలు చదువుకుంటారు. పైనుంచి తిరిగే లైట్‌ ఆ చుట్టుపక్కల వారికి ఒకరకమైన భద్రత, భరోసానిస్తుంటుంది. ఇలా పట్టణంలో దాదాపు 50 లైబ్రరీలతో కూడిన లైట్‌హౌస్‌లు ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి రోజూ పుస్తకాలు చదివిస్తారు.
  • వీటి వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయి.
  • ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లటంలో క్యురిటిబా ఎంతో ముందుంది.
  • పౌరవీధులు (సిటిజెన్‌షిప్‌ స్ట్రీట్స్‌)లోనే ప్రభుత్వ కార్యాలయాలుంటాయి... ఇక్కడే బిల్లులు కట్టొచ్చు, లైసెన్సులు తీసుకోవచ్చు... వాటిలోనే కటింగ్‌ కూడా చేసుకోవచ్చు.
  • ప్రతి కాలనీలోనూ 600 సీట్ల ఓపెన్‌ థియేటర్లు, నైట్‌కోర్టులు, తరగతి గదులుంటాయి. కేవలం 1 డాలర్‌ చెల్లిస్తే వివిధ రకాల వృత్తివిద్యలు నేర్పిస్తారక్కడ.

ఈ సృజనాత్మకతకు ఇతనే మూల విరాట్టు...

క్యురిటిబా రూపు రేఖలు మార్చిన మేయర్​.. లర్నర్​

జర్మన్‌, పోలండ్‌, ఇటలీ, ఉక్రెయిన్‌... ఇలా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రజానీకంతో... 1960లకల్లా కిటకిటలాడిపోయిందీ పట్టణం. అనుక్షణం ట్రాఫిక్‌ జామ్‌లతో ఇబ్బందులు పడేది. ఏ పని చేయాలన్నా అడ్డంకులు ఎదురయ్యేవి.

  • 1964లో బ్రెజిల్‌లో మిలిటరీ తిరుగుబాటు తర్వాత... లర్నర్‌ను పట్టణ మేయర్‌గా నియమించారు.
  • పట్టణ మధ్యప్రాంతంలో పాదచారులకు వీలుగా మార్పులు చేర్పులు చేయాలనుకున్నారు లర్నర్‌! కానీ దుకాణదారులు దాన్ని వ్యతిరేకించారు.
  • ఏదైనా చేయాలంటే కోర్టుకెళ్లి స్టే తెచ్చేవారు. దీంతో... ఓసారి లర్నర్‌ ఇలాగైతే కాదని- శుక్రవారం సాయంత్రం కోర్టు మూయగానే మొదలెట్టి... సోమవారం ఉదయంకల్లా యుద్ధ ప్రాతిపదికన పని పూర్తి చేయించారు. ఆ ప్రాంతంలో వాహనాల సంచారం లేకుండా... పాదచారులతో వ్యాపార వినియోగాలు జరిగేలా మార్చేశారు. చూడటానికి, వాడటానికి ఇది బాగుండటంతో... మిగిలిన ప్రాంతాల్లోనూ మార్పు కోసం ప్రజల నుంచే డిమాండ్‌ వచ్చింది.
  • ఇక అక్కడి నుంచి క్యురిటిబా రూపురేఖలే మారిపోయాయి. బస్సులకు ఎక్స్‌ప్రెస్‌ లైన్లు... ప్రయాణికులకు అద్దాల గొట్టపు దారులు.
  • చెత్తను రీసైకిల్‌ చేసిస్తే... వారికి టోకెన్లిచ్చే పద్ధతి చాలా విజయవంతమైంది. వాటిని డబ్బులుగా మార్చుకొని సరకులు కొనుక్కోవచ్చు. దీంతో... పట్టణంలోని 90శాతం ప్రజలు ఈ రీసైక్లింగ్‌లో పాలుపంచుకుంటున్నారు.
  • పట్టణంలోని 70శాతం చెత్త రీసైక్లింగ్‌ అవుతుంది.
  • పెద్దపెద్ద పార్కులు కట్టారు. పట్టణంలోని ప్రతి పౌరుడికి 50 చదరపు అడుగుల పచ్చదనం ఉంటుందిక్కడ.

నాయకులు మారుతారు... ప్రభుత్వాలు మారుతాయి.. కానీ ఈ పట్టణంపై 18 లక్షల మంది ప్రజలకే అధికారం... వారిదే భాగస్వామ్యం! అందుకే ఈ పట్టణాన్ని... గ్రీన్‌ కేపిటల్‌, గ్రీనెస్ట్‌ సిటీ ఆన్‌ అర్త్‌, మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ సిటీ ఇన్‌ ది వరల్డ్‌ అనీ పిలుస్తారు.

ఇదీ చూడండి:ఆమె.. 27 ఏళ్ల తర్వాత పుట్టింది

Last Updated : Dec 7, 2020, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details