భారత్-అమెరికా మధ్య జరగబోయే 2+2 చర్చల్లో చైనా సరిహద్దు అంశం సైతం చర్చకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామన్నారు. మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. చైనా దురాక్రమణపూరిత వైఖరిని నిలువరించాలంటే ఆగ్నేయాసియాలో భారత్ శక్తిమంతంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు దక్షిణ చైనా సముద్రంలో భారత్ తన సైనిక కార్యకలాపాల్ని వేగవంతం చేయడం.. ఆ ప్రాంతంలోని ఇతర మిత్రదేశాలతో కలిసి పనిచేయడం స్వాగతిస్తున్నామన్నారు.
హిమాలయాల నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు చైనా దురుసు వైఖరిని ప్రదర్శిస్తోందని ట్రంప్ పాలకవర్గంలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారత్ వంటి మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ మేరకు రక్షణ విక్రయాలు, విన్యాసాలు, కీలక సమాచార మార్పిడి వంటి అంశాల్లో భారత్‌కు సహకారం అందిస్తున్నామన్నారు. 2016 తర్వాత భారత్-అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కిందన్నారు.