కరోనా వ్యాప్తిని అరికట్టే టీకాలు దాదాపు అన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల ఇంకా కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. అయితే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం రెండు డోసుల పూర్తయిన వారికి బూస్టర్ డోసులు కూడా ఇస్తున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే ఆపాలని అన్నారు.
"ప్రతి రోజూ.. పేద దేశాల్లో ప్రైమరీ డోసుల పంపిణీ కంటే ఆరు రెట్లు ఎక్కువగా బూస్టర్ డోసుల పంపిణీ జరుగుతోంది. ఓవైపు తక్కువ ఆదాయం ఉన్న దేశాలు టీకాల కోసం ఎదురుచూస్తుంటే.. అధిక వ్యాక్సినేషన్ రేటు ఉన్న దేశాలు డోసుల నిల్వలను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్నవారు ఇంకా వారి తొలి డోసు కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. వారిని వదిలిపెట్టి ఆరోగ్యంగా ఉన్నవారికి బూస్టర్ డోసులు పంపిణీ చేయడం, పిల్లలకు టీకా వేయడంలో అర్థం లేదు. బూస్టర్ డోసు పంపిణీని వెంటనే ఆపాలి. ఎంతమందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నది మాత్రమే కాదు.. ఎవరికి టీకాలు ఇస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం" అని టెడ్రోస్ తెలిపారు.