దేశంలో కరోనా మరణాలపై సొంత ప్రభుత్వం చెప్పిన లెక్కలపైనే అనుమానం వ్యక్తం చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారొ. సావోపాలో రాష్ట్రంలోని కరోనా మరణాల లెక్కలను తాను నమ్మడం లేదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం గణాంకాలను తప్పుగా చూపిస్తున్నారని సావోపాలో గవర్నర్ జోవో డోరియాపై తీవ్ర ఆరోపణలు చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు.
మరెక్కడా లేనన్ని..
బ్రెజిల్లో ఇప్పటివరకు 92 కరోనా మరణాలు సంభవించాయి. ఇందులో 68... ఒక్క సావోపాలోలోనే నమోదయ్యాయి. లాటిన్ అమెరికావ్యాప్తంగా సంభవించిన మరణాలకన్నా ఎక్కువగా ఉన్న ఈ సంఖ్యపై అనుమానం వ్యక్తంచేశారు బోల్సొనారొ. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న సావోపాలో రాష్ట్ర గవర్నర్ జోవో డోరియా.. రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయన్నారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరు: భారత్కు అమెరికా ఆర్థిక సాయం