తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ ప్రచార శంఖారావం- ఫస్ట్ షో ఫ్లాప్​!

కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతూ ఇంటికే పరిమితమైతే.. అమెరికా ప్రభుత్వానికి మాత్రం వైరస్​ కన్నా ముఖ్యమైనది మరొకటి ఉందట. అవే ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు. అందుకే మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలోనూ ప్రచార హోరు మొదలైంది. వేల మందితో ట్రంప్​ ఇండోర్​లో సభ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల తర్వాత వేల మందితో జరగాల్సిన బహిరంగ సభను రద్దు చేశారు. అలా ట్రంప్​ ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి.

By

Published : Jun 21, 2020, 6:03 PM IST

Updated : Jun 21, 2020, 6:47 PM IST

trump election rally 2020
ట్రంప్​ ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే హంసపాదు

ఒకవైపు కరోనా విజృంభణ... మరోవైపు జాత్యహంకార ధోరణిపై నిరసనల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఈ సాకుతో ట్రంప్‌ ఎన్నికలను వాయిదా వేయిస్తారని ఆయన ప్రత్యర్థులు అనుమానిస్తున్న సమయంలో.. అనూహ్యంగా ఆయనే తొలి ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఆశించిన మేర జనాలు రాకపోవడం, తన సిబ్బందిలోనే కొంతమందికి వైరస్​ రావడం, వైరస్​ వ్యాప్తిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడం వల్ల.. తన ప్రచార రథానికి బ్రేక్​ వేశారు ట్రంప్​. అలా వేల మందితో ఇండోర్​లో జరిగిన సమావేశం అనంతరం భారీగా మద్దతుదార్లతో జరుగుతుందని ఆశించిన బహిరంగ సమావేశాన్ని అనూహ్యంగా రద్దు చేశారు.

ఆశించినంత కాదు..!

స్వదేశీ నినాదం, దేశమే తొలి ప్రాధాన్యం అంటూ మాట్లాడే ట్రంప్​కు భారీగానే మద్దతుదారులు ఉంటారు. అందుకే ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమం కోసం లక్ష మంది పట్టే ఒక్లహోమాలోని టల్సా ఎరీనాను బుక్​ చేశారు. తొలి ప్రచార సభ కావడం వల్ల స్టేడియం హోరెత్తిపోతుందని అనుకున్నా.. అంత సీన్​ కనిపించలేదు. 19 వేల ఖాళీ సీట్లు దర్శనమిచ్చాయి. అయితే వచ్చిన వాళ్లు కూడా కరోనా భయాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్యం ప్రదర్శించారు. మాస్కులు, సామాజిక దూరం నిబంధనలను పెడచెవిన పెట్టారు.

ఖాళీగా ఇండోర్​ స్టేడియం

సభ జరిగేటప్పుడు ఎలాంటి అల్లర్లు జరకపోయినా.. బయట భారీగా నిరసనకారులు కనిపించారు. జార్జ్​ ఫ్లాయిడ్​కు న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆరుగురికి కరోనా...

ప్రచార కార్యక్రమానికి వెళ్లేముందు చేసే టెస్టుల్లో ట్రంప్ బృందంలో ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. ట్రేసింగ్​ చేసి అందర్నీ క్వారంటైన్​కు పంపింది. అయితే వీరి వల్ల సభ మాత్రం రద్దు కాలేదు.

ప్రసంగం ఇలా...

దాదాపు వేదికపై 1 గంట 45 నిమిషాలు మాట్లాడిన ట్రంప్​... నేషనల్​ హెరిటేజ్​ అయిన తమ పార్టీకి, లెఫ్ట్​ వింగ్​ ర్యాడికలిజమ్​కు జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. కరోనాను 'కుంగ్​ ఫ్లూ'గా అభివర్ణించిన ఆయన.. ఈ మహమ్మారి చైనా నుంచే వచ్చిందని అన్నారు. తమ దేశంలోని ప్రత్యర్థి పార్టీ వాళ్లకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు.

వేదికపై మాట్లాడుతున్న ట్రంప్​

జనాలు రాకపోవడానికి మీడియాను కారణంగా విమర్శించారు ట్రంప్​. నిరసనకారులు ఏదైనా చేస్తారేమోనని అభద్రతా భావం కల్పించడం వల్లే జనాలు తక్కువగా వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక టెస్టులు చేసిన దేశం అమెరికా అని ఉద్ఘాటించిన ఆయన.. దాదాపు 25 మిలియన్​ మందికి టెస్టుల చేసినట్లు స్పష్టం చేశారు. ఎక్కువ టెస్టుల వల్లే ఎక్కువ కేసులు బయటపడుతున్నట్లు స్పష్టం చేశారు.

నిరసనకారులతో వేదిక బయట ప్రాంగణం

ఆందోళన వ్యక్తం...

అమెరికాలో కొన్ని చోట్ల వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా.. మరికొన్ని చోట్ల తగ్గుతోంది. నెవాడా, ఆరిజోనాలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఓక్లహోమాలో ఇటీవలె రెండు ఇండోర్​ మీటింగ్​ల కారణంగా విపరీతంగా కేసులు పెరిగాయి. అయితే ఈ మధ్య కరోనా సామాజిక వ్యాప్తి దశ మొదలైన ఈ ప్రాంతంలో.. ట్రంప్​ సభ నిర్వహించడంపై కొందరు నిపుణులు మండిపడ్డారు. ర్యాలీలు, నిరసనల కారణంగా వైరస్​ వ్యాప్తి ఎక్కువగా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండోర్​ వేదికల్లో వెంటిలేషన్​ తక్కువగా ఉండటం వల్ల కార్యక్రమానికి హాజరు అయివారికి కరోనా ముప్పు ఉంటుందని అభిప్రాయపడింది అమెరికాలోని సీడీసీ( సెంటర్​ ఫర్​ డీసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​).

బహిరంగ ర్యాలీ రద్దు..

ఇండోర్​ సభ తర్వాత డౌన్​టౌన్​ టల్సాలో జరగాల్సిన ట్రంప్​ బహిరంగ సభ అనూహ్యంగా రద్దు చేశారు. ఈ ప్రాంతానికి సంఘీభావం తెలిపేందుకు ట్రంప్​ మద్దతుదారులు, నిరసన తెలిపేందుకు నల్లజాతీయులు భారీగా తరలివచ్చారు. అందరూ నిరాశతో వెనుదిరిగారు. అయితే సభ ఎందుకు అత్యవసరంగా రద్దు చేశారో స్పష్టత ఇవ్వలేదు.

బహిరంగ సభకు వచ్చిన ట్రంప్​ మద్దతుదారులు
బహిరంగ సభకు వచ్చిన నిరసనకారులు

ఎన్నికలు రద్దు అవ్వొచ్చా..?

ఒకవేళ కరోనా విజృంభించినా కూడా ఎన్నికలను నిర్వహించుకునే అవకాశాలు అమెరికాలో ఉన్నాయి. సాధారణ ఓటింగ్‌తో పాటు ఆబ్సెంటీ బ్యాలెట్‌, మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌, ముందస్తు ఓటింగ్‌లాంటి పద్ధతులు అందుకు కొంతమేరకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. భారీగా వరుసల్లో నిలబడకుండా పోస్టు ద్వారా ఓటును పంపొచ్చు. ఇవన్నీ అమెరికా ఎన్నికల ప్రక్రియలో ముందే ఉన్నాయి.

ఇప్పటివరకు ఎన్నడూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు. ప్రపంచ యుద్ధ సమయాల్లోనే కాకుండా అమెరికా అస్తిత్వానికే సవాలు విసిరిన, అత్యంత క్లిష్టమైన 1864 అంతర్యుద్ధం సమయంలోనూ అధ్యక్ష ఎన్నికలు ఆగలేదు.

ఈ ఏడాది నవంబర్​ 3న ఎన్నికలు జరగాల్సి ఉంది.

రాజ్యాంగంలో ఏముంది?

అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు.

" అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవీస్వీకారం చేసిన నాలుగేళ్ల తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారంనాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీకి ఎన్నికలు జరగాలి" అని అమెరికా రాజ్యాంగం నిర్దేశించింది.

  • ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్‌ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకం. ట్రంప్‌ వ్యతిరేక అల్లర్లను పక్కనబెడితే... కరోనా కారణంగా ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయలేని దారుణమైన పరిస్థితులు తలెత్తితే మాత్రం డెమొక్రాట్లు వాయిదాకు మద్దతు ఇవ్వటం అనివార్యం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
  • నాలుగు నెలల తర్వాత దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనే అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదా అనేది అధారపడుతుంది. ఒకవేళ అలాంటి రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది. అలా జరిగినా కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఏమీ కొనసాగలేరు.
  • అమెరికా రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లే. జనవరి 20తో ముగుస్తుంది. కొత్తవాళ్ల ఎంపికతో దానికి సంబంధం లేదు. ఒకవేళ ట్రంప్‌ ఈసారి ఎన్నికల్ని వాయిదా (జనవరి దాటి) వేసినా రాజ్యాంగం ప్రకారం 2021 జనవరి 20 నాడు పదవిలోంచి దిగిపోవాల్సిందే!
  • అప్పటికీ ఎన్నికలు జరగకుంటే ప్రతినిధుల సభ (కాంగ్రెస్‌) కొత్త అధ్యక్షుడిని, సెనేట్‌ -ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తాయి (తాత్కాలికంగా). కాంగ్రెస్‌ పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు జరగకుంటే అప్పుడు అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సిన బాధ్యత సెనేట్‌ (ఇది మన రాజ్యసభ లాంటిది కాబట్టి పదవీకాలం ముగియటం అంటూ ఉండదు)పై పడుతుంది. ఇవన్నీ ఎన్నడూ అమెరికా చరిత్రలో జరగలేదు.

ఇదీ చూడండి:

Last Updated : Jun 21, 2020, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details