''మేం చిన్నప్పుడు.. ఎక్కువగా అణుయుద్ధాల గురించి భయపడేవాళ్లం. అణుదాడి వచ్చినప్పుడు.. బేస్మెంట్ కిందకు వెళ్లి డబ్బాల్లో తలదాచుకునేవాళ్లం. అందులోనే నీళ్లు, ఆహారం పెట్టుకునేవాళ్లం.
ప్రస్తుత ప్రపంచం ఇలాంటి విపత్తుల్ని చూడకపోవచ్చు. కానీ రానున్న కొన్ని దశాబ్దాల్లో.. యుద్ధంలో కాకుండా 10 మిలియన్ల మందిని ఏదైనా చంపినట్లయితే.. అది అత్యంత ప్రమాదకర వైరస్ కావొచ్చు. దాడి చేసేది క్షిపణులు కాదు. సూక్ష్మజీవులు. ఆ విపత్తును ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా లేం. అంటువ్యాధిని ఆపేందుకు చాలా తక్కువ పెట్టుబడులు పెట్టాం. కానీ.. అణ్వస్త్రాలను మార్గమధ్యంలోనే అంతం చేసే శస్త్రాలపై మాత్రం భారీగా వెచ్చించాం.''
కరోనా వైరస్ గురించి 2015లోనే దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ చెప్పిన మాటలివి. ఓ మహమ్మారి దాడి చేస్తుందని ఆయన ప్రజాముఖంగా టెడ్ టాక్‌లో చెప్పడం విశేషం. కరోనా వెలుగుచూడని ఆరేళ్లకు ముందే ఆయనకు ఎలా తెలిసింది. ఇంకా ఆయన ఎన్నో విషయాలు చెప్పారు.
అంచనాలకు తగ్గట్లే..
ఆయన చెప్పినట్లే.. 2019 ఆఖర్లో చైనాలో మొదలై ప్రపంచ దేశాలకు పాకింది అంటువ్యాధి కరోనా. దాదాపు 18 కోట్ల కేసులు,40 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. అంతకుముందు 1976లో తొలిసారి బయటపడ్డ ప్రాణాంతక వ్యాధి ఎబోలా వైరస్.. 2013-16లో తీవ్రంగా మారింది. అప్పట్లో 11 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
సరైన వ్యవస్థే లేదు..
అప్పట్లో ఎబోలా నియంత్రణకు ఏర్పాటు చేసిన వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, అసలు సరైన వ్యవస్థే లేదని విమర్శించారు గేట్స్. ''వ్యాధిని పరిశీలించేందుకు నిపుణులు సిద్ధంగా లేరు, ఎంతమేర వ్యాప్తి చెందిందని చెప్పేవారు లేరు. ఒక పెద్ద మహమ్మారి వచ్చిందంటే చాలా మంది సిబ్బంది అవసరం. ప్రపంచ దేశాలకు పంపాలంటే ఎన్నో ఏర్పాట్లు చేయాలి. కానీ ఎవరూ లెక్కచేయలేదు. ఆ దిశగా ఎవరూ ఆలోచించలేదు. ఇంకా.. కేసులు నివేదించడం ఆలస్యమైంది. ఇక ఆన్లైన్లో పెట్టేసరికి పరిస్థితి విషమించింది.'' అని వివరించారు.
''ఇది నిజంగా అంతర్జాతీయ వైఫల్యమే. ఇలాంటి అంటువ్యాధులను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిధులను సమకూరుస్తుంటుంది. కానీ చెప్పిన వాటికి మాత్రం కాదు. సినిమాల్లో మాత్రం వేరేలా ఉంటుంది. వైద్య బృందం వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అప్పటికే ఆలస్యమవుతుంది. కానీ అది హాలీవుడ్‌లోనే.''
- బిల్ గేట్స్
అధ్వాన పరిస్థితులు..
ఇంకా రాబోయే వైరస్ మరింత వినాశనకరంగా ఉంటుందని హెచ్చరించారు గేట్స్. అయితే.. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా విస్తరించకపోవడానికి ఆరోగ్య కార్యకర్తలు పోరాటం, గాలి ద్వారా వ్యాపించకపోవడం, పట్టణ ప్రాంతాల్లో వ్యాప్తి చెందకపోవడమేనని, ఇది నిజంగా అదృష్టమని చెప్పారు.
కానీ, తదుపరి విపత్తు నాటికి అంత అదృష్టం ఉండకపోవచ్చని, ఎక్కడైనా వైరస్ ఉండొచ్చని తెలిపారు. వచ్చే వైరస్ కృత్రిమంగా సృష్టించింది(బయోటెర్రరిజం) అయినా, సహజసిద్ధ వైరస్ అయినా.. పరిస్థితులు అధ్వాన్నంగా ఉంటాయని వివరించారు.
''గాలి ద్వారా సోకే.. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూనే చూద్దాం. అప్పుడేమైంది. ఇది చాలా వేగంగా ప్రపంచ దేశాలను చుట్టేసింది. 30 మిలియన్ల కంటే ఎక్కువమందినే బలిగొంది. కాబట్టి ఇది తీవ్రమైన సమస్య. మనం ఆందోళన చెందాల్సిందే.''
- బిల్ గేట్స్