తెలంగాణ

telangana

ETV Bharat / international

Bill Gates: అమెరికా అతిపెద్ద రైతు బిల్‌గేట్స్‌

బిల్​ గేట్స్​ అంటే మైక్రోసాఫ్ట్‌ దిగ్గజంగానే అందరికీ తెలుసు. కానీ ఆయనో బడా భూస్వామి అని తెలియదు. వ్యవసాయం అంటే ఎంతో ఇష్టపడే బిల్​గేట్స్​కు అమెరికాలోని 18 రాష్ట్రాల్లో 2,69,000 ఎకరాల సాగుభూములు ఉన్నట్లు ఎన్‌బీసీ మీడియా కథనం ప్రచురించింది.

bill-gates
బిల్‌గేట్స్‌

By

Published : Jun 11, 2021, 10:48 PM IST

బిల్‌గేట్స్‌ అంటే.. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, మహా దాత, ఓ బిలియనీర్‌.. మనకు తెలిసింది ఇదే. కానీ, ఆయనో పెద్ద భూస్వామి కూడా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వ్యవసాయం మీద ఎంతో ఆసక్తి చూపించే బిల్‌గేట్స్‌ దంపతులకు అమెరికా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగుభూములు ఉన్నాయి. ఆ దేశ అతిపెద్ద రైతుల్లో గేట్స్‌ కూడా ఒకరు.

అమెరికా భూ గణాంకాల ప్రకారం.. గేట్స్‌ దంపతులకు లూసియానా, నెబ్రస్కా, జార్జియా సహా 18 రాష్ట్రాల్లో 2,69,000 ఎకరాల సాగుభూములు ఉన్నట్లు ఎన్‌బీసీ మీడియా కథనం వెల్లడించింది. ఉత్తర లూసియానాలో ఉన్న 70వేల ఎకరాల్లో వీరు సోయాబీన్స్‌, మొక్కజొన్న, పత్తి, వరి వంటలు పండిస్తున్నారు. ఇక నెబ్రస్కాలో 20వేల ఎకరాలు, జార్జియాలో 6వేల ఎకరాలు, వాషింగ్టన్‌లో 14వేల ఎకరాల భూములు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వాషింగ్టన్‌లో గేట్స్‌ పెద్ద మొత్తంలో బంగాళాదుంపలను పండిస్తున్నారు. ఇది ఎంత పెద్దగా ఉంటాయంటే వీటిని అంతరిక్షం నుంచి చూసినా కన్పిస్తాయని ఎన్‌బీసీ కథనం పేర్కొంది. అమెరికాకు చెందిన అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ తమ ఫ్రైస్‌లో ఉపయోగించే బంగాళదుంపలు గేట్స్‌ పొలాల నుంచే వెళ్తాయట. వీటితో పాటు క్యారెట్లు, ఉల్లిగడ్డలు కూడా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయని సదరు మీడియా సంస్థ తెలిపింది. గేట్స్‌ ఈ భూములను తమ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ కాస్‌కేడ్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

తమ 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు గేట్స్‌ దంపతులు ఇటీవల సోషల్‌మీడియాలో సంయుక్త ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 130 బిలియన్‌ డాలర్లు(రూ.9.64లక్షల కోట్లు). 2000లో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను(దాదాపు రూ.4లక్షల కోట్లు) ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు. అయితే దాంపత్య జీవితంలో విడిపోయినప్పటికీ సంస్థ దాతృత్వ కార్యక్రమాల్లో బిల్‌గేట్స్‌, మెలిందా కలిసే పాల్గొంటారని బిల్‌ మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉండగా.. విడాకుల నేపథ్యంలో గేట్స్‌ దంపతులు తమ ఉమ్మడి ఆస్తులను పంచమని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో కోరారు. ఇందులో ఈ వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:బిల్​గేట్స్ జీవితంలో చీకటి కోణం... అందుకే అలా...

ABOUT THE AUTHOR

...view details