తెలంగాణ

telangana

ETV Bharat / international

Facebook Down News: విద్వేషాలతో వికృత క్రీడ

గంటలపాటు ఫేస్‌బుక్‌, అనుబంధ వేదికల సేవలు నిలిచిపోవడం వెనక ఏదో పెద్ద కారణమే ఉందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఫేస్‌బుక్‌లోని (Facebook Content) సమాచారం విద్వేషాలు రగిలిస్తోందని, పిల్లల మానసిక ఆరోగ్యంపైనా దుష్ప్రభావం చూపుతోందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి, ప్రజావేగు ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆ మర్నాడే ఈ సామాజిక మాధ్యమాలన్నీ (Facebook Down News) మూగబోవడం వెనక ఏదో మతలబు ఉందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

facebook
ఫేస్​బుక్​

By

Published : Oct 8, 2021, 7:18 AM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ సహా దాని అనుబంధ వేదికలైన ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల సేవలు నాలుగు రోజుల క్రితం (సోమవారం) దాదాపు ఏడు గంటలపాటు నిలిచిపోవడం (Facebook Down News) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాంకేతిక లోపాలే ఇందుకు కారణమంటూ సంస్థ సీఈఓ జుకర్‌బర్గ్‌ వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. అయితే ఇన్ని గంటలపాటు ఫేస్‌బుక్‌, అనుబంధ వేదికల సేవలు నిలిచిపోవడం వెనక ఏదో పెద్ద కారణమే ఉందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఫేస్‌బుక్‌లోని (Facebook Content) సమాచారం విద్వేషాలు రగిలిస్తోందని, పిల్లల మానసిక ఆరోగ్యంపైనా దుష్ప్రభావం చూపుతోందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి, ప్రజావేగు ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆ మర్నాడే ఈ సామాజిక మాధ్యమాలన్నీ మూగబోవడం వెనక ఏదో మతలబు ఉందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. తప్పుడు సమాచారం వ్యాపించకుండా ఫేస్‌బుక్‌లో ఉండే రక్షణ వ్యవస్థలన్నింటినీ తొలగించడమే అనర్థాలకు ప్రధాన కారణమన్నది హౌగెన్‌ ఆరోపణ. అమెరికా పార్లమెంటు భవనంపై ఈ ఏడాది జనవరి ఆరో తేదీన జరిగిన దాడికి ఇదే కారణమని ఆమె చెప్పారు.

లాభాల కోసం వెంపర్లాట

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ఏకంగా పార్లమెంటు భవనంలోకి చొరబడి అల్లకల్లోలం సృష్టించారు. అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన ఆ ఉదంతం అగ్రరాజ్య ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. ఆ దాడికి ఫేస్‌బుక్‌ పరోక్షంగా సాయపడిందని, ఆల్గారిథమ్స్‌ను మార్చి విద్వేష సమాచార వ్యాప్తికి కారణమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం తమ శక్తికి మించిన పనిగా అప్పట్లో ఫేస్‌బుక్‌ చెప్పుకొచ్చింది. తాజాగా హౌగెన్‌- పార్లమెంటు భవనంపై దాడికి ఈ సంస్థే కారణమనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయనడంతో అగ్రరాజ్యం దాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఫేస్‌బుక్‌ ఆల్గారిథమ్స్‌లో మార్పులు చేస్తే ఖాతాదారులు దాన్ని గంటల తరబడి చూసే అవకాశం ఉండదు. అదే జరిగితే ప్రకటనల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయానికి భారీగా గండిపడుతుంది. కాబట్టే జుకర్‌బర్గ్‌ కంపెనీ... వినియోగదారుల శ్రేయస్సును గాలికొదిలి- లాభాలు ఆర్జించడంపైనే దృష్టి పెట్టిందని హౌగెన్‌ ఆరోపించారు. సంబంధిత ఆధారాలను ఆమె వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రికకు అందజేశారు. తాజాగా అమెరికన్‌ సెనేట్‌ ఉపసంఘం ముందూ తన వాదన వినిపించారు. సామాజిక మాధ్యమ సంస్థలపై పర్యవేక్షణకు ప్రభుత్వమే ఓ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హౌగెన్‌ ఇచ్చిన ఆధారాలను అధ్యయనం చేసిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక- ఫేస్‌బుక్‌ మాత్రమే కాదు, దాని అనుబంధ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ సైతం తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమవుతోందని వివరించింది. ఇన్‌స్టాలో వచ్చే పలు పోస్టులు అమ్మాయిల మానసిక ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తున్నాయని వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో విద్వేష సమాచార వ్యాప్తిని నియంత్రించడానికి ఏం చేయాలని మల్లగుల్లాలు పడుతున్న అమెరికాకు హౌగెన్‌ ఇచ్చిన ఆధారాలు, ఆమె చేసిన సూచనలతో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. కేవలం ఫేస్‌బుక్‌ను నియంత్రించే అంశంపైనే అగ్రరాజ్యంలో అధికార, విపక్షాలు ఏకమయ్యే వాతావరణం కనిపిస్తోంది. డెమొక్రటిక్‌ సెనేటర్‌ రిచర్డ్‌ బ్లూమెంథల్‌ ఈ సామాజిక మాధ్యమంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్‌ ఎన్నో సత్యాలను కప్పిపెట్టి విద్వేషాన్ని ఎగదోస్తోందని, ఈ రోజు అది తన స్వీయ ప్రయోజనాల కోసం చేస్తున్న నష్టం ఒక తరాన్ని వెంటాడుతుందని వ్యాఖ్యానించారు.

ఫేస్‌బుక్‌ ఏమంటోంది?

తమపై హౌగెన్‌ ఆరోపణలు అర్థరహితమైనవని జుకర్‌బర్గ్‌ తన ఉద్యోగులకు లేఖ రాశారు. విద్వేష సమాచార వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ, ప్రత్యేకంగా బృందాల ద్వారా పనిచేయిస్తున్నామని జుకర్‌బర్గ్‌ చెబుతున్నారు. ఈ మాటల్లో వాస్తవం చాలా తక్కువని హౌగెన్‌ కుండ బద్దలు కొట్టారు. ఫేస్‌బుక్‌లో తాను పని చేసిన 'సివిక్‌ ఇంటెగ్రిటీ టీమ్‌' పని ఇదే అయినా, అరకొర వనరులే సమకూర్చారని, చివరికి దాన్ని రద్దు చేశారని ఆమె వెల్లడించారు. భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఓ పార్టీకి ఫేస్‌బుక్‌ కొమ్ముకాస్తోందనే విమర్శలున్నాయి. దీనిపై ఆ సంస్థ ఉపాధ్యక్షుడు అజిత్‌ మోహన్‌- శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీసంఘం ముందు సంజాయిషీ ఇచ్చారు. తాము పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై దిల్లీలో జరిగిన అల్లర్ల సందర్భంగా సుప్రీంకోర్టు... 'సామాజిక మాధ్యమాలకు ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి ఉంది. ప్రజల్ని రెండు వర్గాలుగా విడదీసే సామర్థ్యం ఉంది. సరైన సమాచారం అందుబాటులో లేని వ్యక్తులు దీన్నే నిజమని నమ్మే ప్రమాదం పొంచి ఉంది' అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. నిత్యం 160 కోట్ల మందికి పైగా వినియోగదారులు చూసే ఫేస్‌బుక్‌కు ప్రజల పట్ల మరింత శ్రద్ధ అవసరమన్నది హౌగెన్‌ ఆకాంక్ష. ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాలు విద్వేష సమాచార వ్యాప్తికి వేదికలు కాకుండా- కఠిన చట్టాలతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

ఇదీ చూడండి:వాట్సాప్​, ఇన్​స్టా, ఫేస్​బుక్​ సేవలు పునరుద్ధరణ

ABOUT THE AUTHOR

...view details