తెలంగాణ

telangana

అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్​ ప్రమాణం

By

Published : Jan 20, 2021, 7:45 PM IST

Published : Jan 20, 2021, 7:45 PM IST

Updated : Jan 21, 2021, 1:21 AM IST

Biden's oath ceremony live updates
బైడెన్​ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం

01:20 January 21

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ (78) ప్రమాణస్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10.20 గంటలకు ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎడమ చేతిని బైబిల్‌పై ఉంచి కుడి చేతిని పైకి లేపి బైడెన్‌ ప్రమాణం పూర్తి చేశారు. అంతకుముందు అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

అమెరికా నూతనాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన బైడెన్‌ అత్యంత వయోధికుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. 48 ఏళ్ల క్రితమే సెనేటర్‌గా ఎన్నికైన ఆయన.. ఇప్పటివరకు ఆరు సార్లు సెనేటర్‌గా పనిచేశారు. 1988, 2008లోనూ బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డారు. 1988లో అధ్యక్ష ఎన్నికల నుంచి ముందుగానే పోటీ నుంచి వైదొలిగారు. ఒబామా హయాంలో రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

ఇక అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన కమలా హారిస్‌ చరిత్ర సృష్టించారు. ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి నల్లజాతి వ్యక్తిగా, తొలి దక్షిణాసియా సంతతిగా కమలా రికార్డుకెక్కారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఆఫ్రో అమెరికన్‌. కమలా తల్లి స్వస్థలం తమిళనాడు. తండ్రిది జమైకా దేశం. కమలా హారిస్‌ హేస్టింగ్స్‌ లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990లో న్యాయవాద వృతిని చేపట్టిన కమలా.. 2002లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికయ్యారు. అనంతరం 2011లో శాన్‌ఫ్రాన్సిస్కో అటార్నీ జనరల్​గా‌ కమలా ఎన్నికయ్యారు. 2016లో డెమొక్రటిక్‌ అభ్యర్థిగా సెనేట్‌కు ఎన్నికయ్యారు. 

22:44 January 20

మోదీ శుభాకాంక్షలు..

అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్​కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్​-అమెరికా మైత్రిని దృఢపరిచేందుకు బైడెన్​తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు ట్వీట్​ చేశారు మోదీ.

22:28 January 20

ప్రజాస్వామ్యమే అత్యంత విలువైనది..

  • అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉంది: బైడెన్‌
  • ఇటీవల పార్లమెంటుపై దాడి దురదృష్టకరం: బైడెన్‌
  • అమెరికా ఎన్నో సవాళ్లు అధిగమించి ఎదిగింది: బైడెన్‌
  • ప్రజాస్వామ్యం అత్యంత విలువైందని అమెరికా నమ్మింది: బైడెన్‌
  • మంచి ప్రపంచం కోసం మనమందరం పాటుపడదాం: బైడెన్‌
  • అమెరికాను అన్ని విధాలా మెరుగు పరచాలి: బైడెన్‌
  • కరోనా సంక్షోభ సమయంలో నా ప్రమాణం చరిత్రాత్మక ఘటన: బైడెన్‌
  • ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణం అమెరికాకే గర్వకారణం: బైడెన్‌
  • దేశాభివృద్ధిలో ప్రతిఒక్క అమెరికన్‌ చేయూతనివ్వాలి: బైడెన్‌
  • దేశీయ ఉగ్రవాదంపై తప్పనిసరిగా విజయం సాధిస్తాం: బైడెన్‌
  • ఇది ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్‌
  • శ్వేతవర్ణ అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తాం: బైడెన్‌
  • మనం ఒకరిని ఒకరం గౌరవించుకుందాం: బైడెన్‌
  • కరోనా వల్ల లక్షల ఉద్యోగాలు పోయాయి: బైడెన్‌
  • కరోనా వల్ల ఆర్థిక రంగం కుదేలైంది: బైడెన్‌
  • మన శక్తియుక్తులన్నీ ప్రోది చేసుకుని ముందుకు సాగాల్సిన సమయమిది: బైడెన్‌
  • ప్రజాస్వామ్య పరీక్షలో అమెరికా నెగ్గింది: బైడెన్‌
  • అమెరికాని ఏకతాటిపై నడిపేందుకు కంకణబద్ధుడినై ఉన్నా: బైడెన్‌
  • ఐకమత్యంతో మనం ఎన్నో సాధించవచ్చు: బైడెన్‌

22:17 January 20

బైడెన్​ ప్రమాణం..

అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా జో బైడన్​ ప్రమాణం చేశారు.

22:13 January 20

ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​..

ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా.. కమల చేత ప్రమాణస్వీకారం చేయించారు.

21:54 January 20

వేడుకలో అతిథులు..

బైడెన్​ ప్రమాణస్వీకార మహోత్సవానికి అతిథులు తరలివెళుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ఆయన సతీమణి మిషెల్​ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​, ఆయన సతీమణి హిల్లరి క్లింటన్​లు క్యాపిటల్​కు చేరుకున్నారు.

మరోవైపు ట్రంప్​ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన మైక్​ పెన్స్​ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. 

21:16 January 20

కమల ట్వీట్​..

అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా మరొక గంటలో ప్రమాణస్వీకారం చేయనున్నారు కమలా హారిస్​. ఈ నేపథ్యంలో తన తల్లికి ట్విట్టర్​ వేదికగా గుర్తుతెచ్చుకున్నారు. తాను ఈ స్థితికి చేరడానికి కారణం తన తల్లి అని వీడియో ట్వీట్​లో పేర్కొన్నారు.

21:05 January 20

క్యాపిటల్​లో బైడెన్​-కమల

చర్చిని సందర్శించిన అనంతరం బైడెన్​-కమల.. కుటుంబసభ్యుల సమేతంగా క్యాపిటల్​ చేరుకున్నారు. అధ్యక్షుడిగా బైడెన్​ ప్రమాణం చేసే చారిత్రక ఘట్టానికి మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

20:46 January 20

ప్రార్థనలు...

క్యాపిటల్​కు బయలుదేరే ముందు.. జో బైడెన్​, కమలా హారిస్​లు వాషింగ్టన్​లోని ఓ చారిత్రక చర్చిని సందర్శించారు. కుటుంబసభ్యుల సమేతంగా ప్రార్థనలు నిర్వహించారు.

ప్రతినిధుల సభ స్పీకర్​ పెలోసీతో పాటు మరికొందరు చట్టసభ్యులు వీరి వెంటే చర్చికి వెళ్లారు.

20:01 January 20

బైడెన్​ ట్వీట్​

అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది గంటల్లో ప్రమాణం చేయనున్న బైడెన్​ ట్వీట్​ చేశారు. అమెరికాలో నూతన శకం ఆరంభమైనట్టు తెలిపే విధంగా 'ఇట్స్​ ఎ న్యూ డే ఇన్​ అమెరికా' అని ట్వీట్​ చేశారు.

19:34 January 20

బైడెన్​ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం

కరోనా సంక్షోభం, క్యాపిటల్​ హింసాకాండ వల్ల నెలకొన్న అనిశ్చితి మధ్య మరికొద్ది గంటల్లో డెమొక్రాట్​ నేత జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అగ్రరాజ్య చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భద్రతా చర్యలు చేపట్టారు.

అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12గంటలకు బైడెన్​ ప్రమాణం చేస్తారు. అనంతరం ఉపాధ్యక్షురాలిగా కమలా ప్రమాణం చేస్తారు.

క్యాపిటల్​ హింసాకాండతో అప్రమత్తమైన అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 25వేలకుపైగా మంది నేషనల్​ గార్డ్స్​.. విధులు నిర్వహిస్తున్నారు.

Last Updated : Jan 21, 2021, 1:21 AM IST

ABOUT THE AUTHOR

...view details