అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పనితీరును ఆమోదించేవారు 50 శాతానికి దిగువకు పడిపోయారని పలు సర్వేలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో బైెడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఫలితాలు రావడం ఇదే తొలిసారి. అఫ్గానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ, దేశంలో కరోనా కేసుల పెరుగుదల వల్ల వెల్లువెత్తుతున్న విమర్శల మధ్య ఈ ఫలితాలు చర్చనీయాంశమయ్యాయి.
బుధవారం నాటికి 538 సగటు పోల్స్‌లో బైడెన్ అప్రూవల్ రేటింగ్ 49.3 శాతానికి పడిపోయింది. ఆయన పనితీరుపై అసమ్మతి వ్యక్తం చేసినవారు జనవరి చివరిలో 34 శాతం ఉండగా.. ప్రస్తుతం 44.2 శాతానికి చేరుకున్నారు. ఆగస్టు 7 నుంచి 17 వరకు 10 రోజుల వ్యవధిలో ఆయన పనితీరుకు సగటున 49.6 శాతం ఆమోదం రేటింగ్ వచ్చిందని రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే ద్వారా వెల్లడైంది. అయితే.. అసమ్మతి రేటింగ్ 47.2 శాతంగా ఉందని తెలిసింది.
బైడెన్ ఆమోదం రేటింగ్ ఆగస్టు 13న 53 శాతం ఉండగా.. మంగళవారం నాటికి 46 శాతానికి పడిపోయిందని రాయిటర్స్/ఇప్సోస్ పోల్ వెల్లడించింది.