అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా.. తాను గెలిచాక తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్. ట్రంప్- బైడెన్ మధ్య నాస్విల్లేలోని బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో జరిగిన చివరి సంవాదంలో అమెరికా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఎలా అడ్డుకుంటారని అనుసంధానకర్త వేసిన ప్రశ్నకు బదులుగా బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
" అమెరికా సార్వభౌమత్వం విషయంలో వారు జోక్యం చేసుకుంటున్నారు." అని రష్యా, ఇరాన్, చైనాను ఉద్దేశించి అన్నారు బైడెన్. ఎన్నికల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ట్రంప్ కూడా ఈ విషయం తనకు తెలుసు అని ధ్రువీకరించినట్లు బైడెన్ పేర్కొన్నారు.