అత్యంత అవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పిలుపు నిచ్చారు. వెల్లింగ్‌టన్‌లో ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'ఈ సారి క్రిస్మస్ వేడుకలు ఆర్బాటంగా జరుపుకోవడం కాస్త కష్టమే. ఈ విషయంలో మనం ఎవరినీ తప్పుబట్టలేం. పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాలి.' అని బైడెన్ అన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,50,000 మంది కరోనా మహమ్మారికి బలైనట్లు ఆయన తెలిపారు. ప్రజలు అశ్రద్ధగా వ్యవహరించినందువల్లే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు శీతాకాలంలో వైరస్ విజృంభణ మరింత ఎక్కువగా ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) హెచ్చరించిన విషయం తెలిసిందే. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న మూడు నెలల్లో మరో 2 లక్షల మరణాలు సంభవించే అవకాశముందని సీడీసీ డైరెక్టర్ రోబర్ట్ రెడ్‌ఫీల్డ్ మీడియాతో చెప్పడం అమెరికాలో కరోనా విస్తృతికి అద్దం పడుతోంది. అమెరికాలో ఈ ఒక్క రోజే లక్ష మంది వివిధ ఆస్పత్రుల్లో చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కాలంలో అతి తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.