కరోనా సంక్షోభం, క్యాపిటల్ హింసాకాండ వల్ల నెలకొన్న అనిశ్చితి మధ్య మరికొద్ది గంటల్లో డెమొక్రాట్ నేత జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అగ్రరాజ్య చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భద్రతా చర్యలు చేపట్టారు.
ప్రమాణస్వీకారం..
- మధ్యాహ్నం 12గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30) అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా క్యాపిటల్ ఎదుట బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ బైడెన్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.
- తన కుటుంబానికి చెందిన 127ఏళ్ల బైబిల్‌పై ప్రమాణస్వీకారం చేయనున్నారు బైడెన్. ఆ సమయంలో బైబిల్‌ను జో బైడెన్ భార్య జిల్ బైడెన్ పట్టుకుని ఉంటారు.
- ఆ తర్వాత.. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేస్తారు. జస్టిస్ సోనియా సొటొమేయర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
- ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడిగా తొలి ప్రసంగం చేయనున్నారు బైడెన్. "అమెరికా యునైటెడ్" థీమ్ మీద ఈ ప్రసంగం ఉండనుంది.
భద్రతా వలయం...
క్యాపిటల్ హింసాకాండతో అప్రమత్తమైన అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 25వేలకుపైగా మంది నేషనల్ గార్డ్స్.. విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:-గందరగోళం, అపఖ్యాతి మధ్య ట్రంప్ 'వీడ్కోలు'
వేడుకలో ఎవరెవరు..
ఈసారి వేడుకలో పాల్గొనే వారికన్నా భద్రతా సిబ్బందే ఎక్కువ సంఖ్యలో ఉండనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రజలు, మద్దతుదారులు ఇళ్లకే పరిమితమవ్వాలని అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు ఇప్పటికే పిలుపునిచ్చారు. దీనితో పాటు తాను అధ్యక్ష ప్రమాణస్వీకారానికి దూరంగా ఉంటానని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు క్యాపిటల్ ఘటన నేపథ్యంలో భద్రతా సమస్యల వల్ల పలువురు చట్టసభ్యులు వేడుకకు రాబోమని పేర్కొన్నారు.
ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, కాంగ్రెస్ సభ్యులు వేడుకకు హాజరయ్యే అవకాశముంది. వేడుకకు వచ్చే వారు తమతో పాటు ఓ అతిథిని కూడా తీసుకెళ్లవచ్చు.