మెరుపు వేగంతో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. దానివల్ల ఒక ప్రణాళిక ప్రకారం అఫ్గాన్‌ను వీడాల్సిన యూఎస్ భద్రతా దళాలు.. వేగంగా, జాగ్రత్తగా తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇంత వేగంగా అఫ్గాన్ ప్రభుత్వం కుప్పకూలడం, ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల.. కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉన్న బైడెన్‌కు ఇది పరీక్షా సమయం లాంటిదే. ఇప్పటికే అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పడంలో ఆయన విఫలమయ్యారని రిపబ్లికన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
కాగా, అమెరికా బలగాలు వైదొలుగుతున్న క్రమంలో ఊహించినదానికన్నా వేగంగా తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారాన్ని అందుకున్నారు. అఫ్గాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. ప్రపంచంలోనే అత్యాధునిక ఆధునిక సామగ్రిని అఫ్గాన్ దళాలకు అమెరికా అప్పగించింది. శిక్షణ ఇచ్చింది. అయినా తాలిబన్లతో ఎలాంటి పోరాటం లేకుండా లొంగిపోయాయి.