తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్‌ మన దోస్త్.. చైనాను నమ్మలేం' - biden administration opinion on us india relations

భారత్- అమెరకా ద్వైపాక్షిక బంధంపై అగ్రరాజ్య నూతన అధ్యక్షుడు బైడెన్​ ఎంపిక చేసుకున్న పాలనా బృందం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా కృషి చేస్తామని తెలిపింది. చైనా దూకుడుకు కళ్లెం వేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని స్పష్టం చేసింది.

biden, america, india
భారత్‌ మన దోస్త్...‌ చైనాను నమ్మలేం!

By

Published : Jan 21, 2021, 6:20 AM IST

జాతీయంగా, అంతర్జాతీయంగా చైనా విసురుతున్న అన్ని రకాల సవాళ్లను దీటుగా ఎదుర్కొని, డ్రాగన్‌ దూకుడుకు కళ్లెం వేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్‌ ఎంపిక చేసుకున్న పాలనా బృందం స్పష్టం చేసింది. భారత్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న బలమైన ద్వైపాక్షిక బంధాన్ని మరింత వేళ్లూనుకొనేలా చేస్తామని తెలిపింది. తమ నియామకాలకు ఆమోదం పొందే క్రమంలో బృంద సభ్యులు.. ఆంటోనీ బ్లింకెన్‌ (విదేశీ వ్యవహారాల మంత్రి), లాయిడ్‌ ఆస్టిన్‌ (రక్షణ మంత్రి), అవ్రిల్‌ హెనెస్‌ (నిఘా విభాగ అధిపతి) మంగళవారం సెనేట్‌కు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ ఎదుట హాజరై తమ ప్రాధామ్యాలను వివరించారు.

భారత్‌తో మరింతగా భాగస్వామ్యం

"రక్షణ వ్యవహారాల్లో భారత్‌తో అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లు సమష్ఠిగా ఏర్పాటు చేసుకున్న చతుర్భుజ కూటమిని విస్తృతపరచి మరిన్ని దేశాలను కలుపుకోవాలి. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల అణచివేతలో పాకిస్థాన్‌ చర్యలు అసంపూర్ణంగానే ఉన్నాయి. ఉగ్రమూకలు తన భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని పాకిస్థాన్‌పై ఒత్తిడిని తీవ్రతరం చేస్తా. ప్రపంచాధిపత్యం కోసం చైనా అర్రులు చాస్తోంది. తైవాన్‌ను చైనా ఆక్రమించుకోకుండా నిరోధించేందుకు అమెరికా తన యత్నాలను కొనసాగించాలి."

-లాయిడ్‌ ఆస్టిన్‌, రక్షణ మంత్రి

డ్రాగన్‌ అత్యంత ప్రమాదకారి

"అమెరిన్ల ప్రయోజనాలకు, దేశ భద్రతకు అతిపెద్ద సవాలు చైనా నుంచే ఎదురవుతోంది. జిన్‌జియాంగ్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని పాతరవేస్తున్న చైనా పట్ల మెతక ధోరణి ఏమాత్రం తగదు. కరోనా వైరస్‌ విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించలేదు. సమాచారాన్ని సకాలంలో ఇచ్చి ఉంటే మహమ్మారి కట్టడికి చర్యలు మరింత ప్రభావవంతంగా ఉండేవి. భారత్‌-అమెరికా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. భారత్‌తో బంధం బిల్‌ క్లింటన్‌ హయాం ముగిసే నాటికే బలపడింది. ఒబామా ప్రభుత్వంలో పరస్పర సహకారం మెరుగైంది. అదే ట్రంప్‌ హయాంలోనూ కొనసాగింది. భారత్‌ను జతకలుపుకొని వెళ్తే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సహా ఏ దేశం కూడా మనకు సవాళ్లను విసరలేదు."

-ఆంటోనీ బ్లింకెన్, విదేశీ వ్యవహారాల మంత్రి

బీజింగ్‌ రహస్య కార్యకలాపాలపై గట్టి నిఘా

"చైనా నుంచి అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉంది. వివిధ రంగాల నుంచి డ్రాగన్‌ విసురుతున్న సవాళ్లపై నిఘా వర్గాలను మరింత అప్రమత్తం చేస్తాం. అమెరికా అద్భుత ప్రగతి సాధించిన రంగాల నుంచి రహస్యాలను తరలించే గూఢచర్యాన్ని అడ్డుకొని తీరాలి."

-అవ్రిల్‌ హెనెస్, నిఘా విభాగ అధిపతి

ఇదీ చదవండి :చైనా అధ్యక్షుడు​ కరోనా టీకా వేయించుకోరా?

ABOUT THE AUTHOR

...view details