ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో ఫోన్లో మాట్లాడారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. కొవిడ్-19 ఎదుర్కోవటం సహా అత్యవసర అంతర్జాతీయ సమస్యలపై పోరాటానికి ఐరాస-అమెరికా బంధాన్ని బలోపేతం చేయాల్సిన అవసరంపై చర్చించారు.
భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండటం, పర్యావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవటం, సుస్థిర వృద్ధిని కొనసాగించటం, శాంతి భద్రతలు పెంపొందించటం, విభేధాలను పరిష్కరించటం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులను ప్రోత్సహించటం వంటి కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. అలాగే.. ఇథియోపియాలో చెలరేగుతోన్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు జో బైడెన్. అది పౌరులకు పెను ప్రమాదంగా మారుతోందని అభిప్రాయపడ్డారు.
అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేజ్తోనూ ఫోన్లో మాట్లాడారు జో బైడెన్. కొవిడ్-19 మహమ్మారి కట్టడి, ప్రపంచ ఆరోగ్య భద్రతను బలోపేతం చేయటం వంటి అంశాల్లో అర్జెంటీనాతో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. అర్జెంటీనా, లాటిన్ అమెరికా ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ సందేశాలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
కోస్టారికా అధ్యక్షుడు కార్లోస్ అలవరాడోతో సైతం ఫోన్లో మాట్లాడారు బైడెన్. మానవ హక్కులు, ప్రాంతీయ వలసలు, కొవిడ్-19, పర్యావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును ఎదుర్కోవటంలో కోస్టారికా నాయకత్వం మంచి పనితీరును కనబరిచిందని కొనియాడారు. ఇటీవల తుపానులు, పర్యవారణ మార్పులతో ఎదురవుతున్న సవాళ్ల నుంచి మధ్య అమెరికా త్వరితగతంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: 'కరోనా మూలాలపై దర్యాప్తును రాజకీయం చేయొద్దు'