కాంగ్రెస్ ఆమోదించిన 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా రిలీఫ్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. శుక్రవారం బిల్లును ఆమోదిస్తారని శ్వేతసౌధం తొలుత ప్రకటించినప్పటికీ.. అందుకు ఒకరోజు ముందుగానే ఆయన సంతకం చేశారు.
కరోనాను ఓడించి, ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని బైడెన్ తెలిపారు. దేశాన్ని పునర్నిర్మించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
బిల్లును వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికే బైడెన్ ఒకరోజు ముందుగా సంతకం చేశారని శ్వేతసౌధ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లైన్ తెలిపారు.
అమల్లోకి వస్తే...
కరోనాతో పాటు ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికాను ఆదుకునేందుకు ఈ భారీ ప్యాకేజీ ఉపకరించనుంది. ఈ చట్టం ద్వారా ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ప్రతి అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లను జమ చేస్తారు. నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున భృతి అందిస్తారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల కోసం 50 బిలియన్ డాలర్లు కేటాయిస్తారు. రాష్ట్ర, స్థానిక, గిరిజన ప్రభుత్వాలకు 350 బిలియన్ డాలర్లు, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు 200 బిలియన్ డాలర్లను సాయం కింద అందిస్తారు.