10 కోట్ల మందికి కొవిడ్ టీకా ఇవ్వాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లక్ష్యం శుక్రవారం నాటికి నేరవేరనున్న నేపథ్యంలో శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. కెనడా, మెక్సికో దేశాలకు టీకాలు పంపిణీ చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇతర దేశాలకు ఎన్ని డోసులు పంపిణీ చేయాలనేదానిపై బైడెన్ బృందం వ్యూహాలు రచిస్తోంది.
శుక్రవారం నాటికి బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టి 58 రోజులు అయింది. ఈ నేపథ్యంలో అనుకున్నదానికంటే ముందుగానే టీకా పంపిణీ లక్ష్యాన్ని చేరుకోవడంపై బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో మెక్సికో, కెనడా దేశాలకు మొదటి విడతలో 40 లక్షల ఆస్ట్రాజెనెకా కొవిడ్ టీకాలు పంపనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. అయితే.. 25 లక్షల కొవిడ్ డోసులు మెక్సికోకు, 15 లక్షల డోసులు కెనడాకు ఇవ్వనున్నట్లు శ్వేతసౌధ పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్సాకీ స్పష్టం చేశారు.