అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవిని అధిరోహించనున్న తొలి మహిళగా చరిత్రకెక్కిన కమలా హారిస్ పరిపాలనలో తమదైన ముద్ర వేసే దిశాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ట్రంప్ నుంచి అధికార పగ్గాలను స్వీకరించిన తర్వాత తమ ముందుండే సవాళ్లేంటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్-హారిస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వేటికి ప్రాధాన్యమివ్వనున్నారనే విషయంపై వారి బృందం తాజాగా తమ అధికారిక వెబ్సైట్ ద్వారా స్పష్టతనిచ్చింది. ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన కొవిడ్ మహమ్మారికి కళ్లెం వేసేందుకు వారు అగ్ర ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపింది. ఆర్థిక సంక్షోభం, జాత్యాహంకారం, పర్యావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులపై కూడా పోరాడనున్నట్లు వెల్లడించింది.
'మునుపెన్నడూ లేనంత మెరుగైన అమెరికా'ను ఆవిష్కరించే దిశగా కృషి చేయనున్నట్లు పేర్కొంది. బైడెన్-హారిస్ బృందం తాజాగా వెల్లడించిన వివరాలు ప్రకారం... అమెరికన్లు కరోనా కోరల్లో నుంచి బయటపడటం అత్యవసరం. ఆ దిశగా వారి ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికలను అమలు చేయనుంది. ప్రధానంగా కొవిడ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో చిన్న వ్యాపారాలు, వైద్య సిబ్బందికి అండగా నిలుస్తుంది. సైన్సును విశ్వసిస్తూ, ప్రజారోగ్య నిపుణుల సూచనల మేరకు మహమ్మారి కట్టడికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు బైడెన్-హారిస్ ద్వితీయ ప్రాధాన్యమిస్తారు. మంచి వేతనంతో కూడిన లక్షల కొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తారు. జాతి వివక్షను రూపుమాపడం తృతీయ ప్రాధాన్య అంశం. పర్యావరణ పరిరక్షణ బైడెన్ ప్రభుత్వానికి నూతన ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. ఇందుకోసం మిత్రదేశాలను కలుపుకొని ముందుకెళ్తుంది.