అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నప్పటికీ అధికార బదిలీకి ససేమిరా అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికలపై ఆరోపణలు చేస్తూ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో అధికార బదిలీ ఆలస్యం వల్ల కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక కొన్ని వారాల నుంచి నెలల పాటు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్.
కొవిడ్-19పై ఆరోగ్య సిబ్బందితో వర్చువల్‌గా నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు బైడెన్. తమ బృందానికి ట్రంప్ పరిపాలన విభాగం ఏమాత్రం సహకరించటం లేదని ఆరోపించారు.
" మాకు ఉన్న సమస్యల్లో ఒకటి అధికార బదిలీ ఆలస్యం. ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తికి ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని రకాలా డేటా తెలియజేయాలని చట్టం చెబుతోంది. నిల్వలపై అవసరమైన సమాచారాన్ని పొందలేకపోతున్నాం. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా పంపిణీ చేస్తారు, తొలి ప్రాధాన్యత ఎవరికి, ప్రణాళిక ఏమిటీ అనేది తెలియాల్సిన అవసరం ఉంది. మనకు అందుబాటులో లేని చాలా విషయాలు ఉన్నాయి. అవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అమెరికన్లకు ఇచ్చిన అతిపెద్ద వాగ్దానం వ్యాక్సిన్ పంపిణీని నిలబెట్టుకునేందుకు కొన్ని వారాలు, నెలలు జాప్యం జరిగేలా కనిపిస్తోంది. అధికార బదిలీ బృందం ఎదుర్కొంటున్న సమస్యతోనే ఈ ప్రక్రియ నెమ్మదిస్తోంది. "