అమెరికాలో పాఠశాలలను వీలైనంత త్వరగా, సురక్షితంగా తిరిగి ప్రారంభించడమే.. తన లక్ష్యాల్లో ఒకటని అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. పాఠశాలల పునః ప్రారంభంపై మార్గదర్శకాలను విడుదల చేశారు. మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నప్పటికీ ఎక్కువ పాఠశాలలు తెరవగలిగామని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. తొలి మూడు వారాల్లోనే తాము ఎక్కువ పురోగతి సాధించినట్లు వివరించారు.
అంటువ్యాధుల నివారణ కేంద్రం(సీడీసీ) తాజా మార్గదర్శకాలను రూపొందించింది. తరగతి గదులు.. పాఠశాల బస్సుల్లో తగినంత భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఎల్లప్పుడూ మాస్కులు ధరిస్తూ.. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది.
ఖర్చుకు వెనుకాడం..
సీడీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ వ్యాప్తిని తగ్గించే ఏర్పాట్లు చేసుకోవాలని బైడెన్ తెలిపారు. తరగతి గదుల్లో చిన్నచిన్న మార్పులు.. విద్యార్థులను సురక్షితంగా రవాణా చేసేందుకు మరిన్ని బస్సులు సమకూర్చుకోవాలని సూచించారు. అలాగే బోధనా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలు ముఖ్యమేనని స్పష్టం చేశారు. ఎన్నో ఖర్చులతో పోలిస్తే.. పౌరులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చేసే వ్యయాలు వృధాకావని బైడెన్ అభిప్రాయపడ్డారు.
గత సంవత్సరంలో చాలా త్యాగాలు చేశాం. మన విద్యార్థులకు, విద్యావేత్తలకు, సమాజానికి అవసరమైన వనరులతో మద్దతు ఇవ్వాల్సిన తరుణం వచ్చింది. మరిన్ని ప్రాంతాల్లో సురక్షితంగా పాఠశాలు తెరవగలమని ఆశిస్తున్నాం.
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.
ఇదీ చదవండి: 'రాష్ట్రాలకు 350 బిలియన్ల ఉద్దీపన ప్యాకేజీ!