తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే కరోనా కట్టడికి సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అందులో భాగంగా తొలి 100 రోజుల్లో 10 కోట్ల వ్యాక్సినేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించేలా మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. తాను ఎంపిక చేసిన ఆరోగ్య బృందం ఆ దిశగా నిబద్ధతతో పనిచేయనుందన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 15 మిలియన్ల మందికి పైగా కరోనా బారినపడ్డారు. వీరిలో 2,86,000 మంది మరణించారు.
ఫైజర్, మోడెర్నాతో చేసుకున్న కొనుగోలు ఒప్పందం ప్రకారం.. వ్యాక్సిన్లు వెంటనే అందేలా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ చర్యలు తీసుకోవాలని బైడెన్ సూచించారు. విద్యాలయాలన్నీ వీలైనంత త్వరగా తెరుచుకునేలా చూడడం తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ప్రాణాలను రక్షించేందుకు సరిపడా నిధుల్ని కాంగ్రెస్ అందించాలని కోరారు. అలా అయితే, తన 100 రోజుల పాలన పూర్తయ్యే నాటికి విద్యా సంస్థలన్నీ తెరిచేందుకు కృషి చేస్తామన్నారు. మాస్కులు ధరించేలా చూడడం, వ్యాక్సినేషన్, స్కూళ్ల పునఃప్రారంభమే తన తొలి 100 రోజుల పాలనలో కీలక లక్ష్యాలని తెలిపారు.