అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా.. అధికార మార్పిడిపై ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించేందుకు ఇంకా నిరాకరిస్తుండడంతో ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. మరోవైపు అధికార బదిలీలో కీలక పాత్ర పోషించే 'జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్'(జీఎస్‌ఏ) విభాగం.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపును ఇంకా అధికారికంగా గుర్తించలేదు. దీంతో బైడెన్ బృందం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
ఎన్నికల్లో విజేతపై స్పష్టత రాగానే జీఎస్‌ఏ వారి గెలుపును అధికారికంగా గుర్తిస్తుంది. దాంతో అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ, ఇప్పటి వరకు జీఎస్‌ఏ నుంచి అధికార బదిలీపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అభ్యర్థి విజయాన్ని ఎప్పుడు గుర్తించాలి.. ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై అమెరికా రాజ్యాంగంలో ఎలాంటి స్పష్టత లేదు. అయితే, విజేత ఎవరన్నదానిపై స్పష్టత వచ్చిన వెంటనే జీఎస్‌ఏ తన తదుపరి ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది.