తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్ ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు- మనకే మేలు! - హెచ్1బీ వీసా జో బైడెన్

ఇమ్మిగ్రేషన్ విధానంలో సంస్కరణలకు నాంది పలకనున్నారు అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్. కీలకమైన వీసాల విషయంలో ట్రంప్ సర్కారు విధించిన ఆంక్షలను తొలగించనున్నారు. హెచ్​1బీ వీసాల సంఖ్య పెంచడం సహా శాశ్వత నివాసదారులు తమ కుటుంబంతో కలిసి ఉండేలా నిబంధనలు సరళతరం చేయనున్నారు. ఈ మేరకు తన ప్రణాళికలను ఎన్నికల విధాన పత్రంలో వివరించారు.

Biden plans to increase H-1B visa limit and remove country quota for green cards
బైడెన్ ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు- భారతీయులకు మేలు!

By

Published : Nov 8, 2020, 10:57 AM IST

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. ఇమ్మిగ్రేషన్ విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికల విధాన పత్రంలో పేర్కొన్న విధంగా హెచ్​1బీ సహా నైపుణ్య ఉద్యోగులను అమెరికాలోకి అనుమతించే వీసాల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలో ఉద్యోగ ఆధారిత వీసాలపై ఉన్న పరిమితులను తొలగించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

ఇదివరకు ఉద్యోగ ఆధారిత వీసా(గ్రీన్ కార్డు)లపై ట్రంప్ సర్కారు పరిమితి విధించింది. ఏటా లక్షా 40 వేలకు మించి గ్రీన్​కార్డులు జారీ చేయరాదని నిర్ణయించింది. అయితే ఈ పరిమితిని బైడెన్ సడలించే అవకాశం ఉంది. శాశ్వత, ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వీసాల సంఖ్యను పెంచేందుకు కాంగ్రెస్​తో కలిసి పనిచేయనున్నట్లు తన ఎన్నికల ప్రణాళికలో ఆయన వివరించారు.

మరోవైపు, హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగ అవకాశాలను తొలగిస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బైడెన్ పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ట్రంప్ యంత్రాంగ నిర్ణయాలతో ప్రభావితమైన వేలాది మంది భారతీయులకు ఈ నిర్ణయం ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది.

నైపుణ్య విద్యార్థులు అమెరికాలోనే

వీటితో పాటు స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్) కోర్సుల్లో పీహెచ్​డీలు చేసే పట్టభద్రులను వీసా పరిమితి నుంచి మినహాయించనున్నట్లు బైడెన్ తన ఎన్నికల ప్రణాళికలో వివరించారు. అమెరికాలో డాక్టరేట్ విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డ్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అత్యంత ప్రతిభ గల విద్యార్థులను విదేశాలకు తరలిస్తే సొంత ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో వీటిపైనా బైడెన్ యంత్రాంగం తన కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉంది.

నైపుణ్య వలస కార్మికులను ఉపయోగించుకునే విధంగా నగరాలు, కౌంటీల స్థాయిలో కొత్త వీసా విధానానికి అనుమతించేందుకు బైడెన్ ప్రణాళికలు వేస్తున్నారు. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి కోసం అదనపు ఇమ్మిగ్రేషన్ వీసాలు జారీ చేసే విధంగా పెద్ద నగరాలు, కౌంటీలకు అధికారం కల్పించనున్నారు.

కుటుంబాలతో కలిసి ఉండేలా

అమెరికాకు వచ్చిన వలసదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసుండేలా బైడెన్ తన కార్యాచరణ పత్రంలో వివరించారు. కొన్ని దేశాలపై పరిమితులు విధించే ప్రస్తుత విధానం వల్ల దరఖాస్తుదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు ఏళ్ల సమయం పడుతోందని చెప్పారు. మరోవైపు కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు బైడెన్ మద్దతిస్తున్నారు. అమెరికాలోని గ్రీన్​కార్డ్ హోల్డర్ల కుటుంబ సభ్యులకు శాశ్వత నివాస అనుమతులు లభించేవరకు తాత్కాలిక వీసాలు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గ్రీన్​కార్డ్ హోల్డర్ల భాగస్వాములు, పిల్లలపై వీసా పరిమితిని రద్దు చేయనున్నారు.

అమెరికాలో నైపుణ్యాధిక ఉద్యోగాల్లో పనిచేసేందుకు ఇతర దేశీయులను చేర్చుకొనేందుకు హెచ్1బీ వీసాలు ఉపయోగపడతాయి. ఈ వీసాల ద్వారా అమెరికాలోని కంపెనీలు భారత్, చైనా దేశాల నుంచి ఏటా వేలాది మందిని తమ సంస్థల్లో చేర్చుకుంటాయి.

ABOUT THE AUTHOR

...view details