తెలంగాణ

telangana

ETV Bharat / international

Russia- Ukraine war: 'యుద్ధ పరిణామాలకు బాధ్యత రష్యాదే' - Russia-Ukraine War Crisis

Biden on Russia: ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. పుతిన్​ను ఆక్రమణదారుడిగా అభివర్ణించారు బైడెన్​. పుతిన్​ యుద్ధాన్ని ఎంచుకున్నారని అన్నారు. పుతిన్‌.. సోవియేట్‌ యూనియన్‌ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్‌ అంశంపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

Russia attack Ukraine
పుతిన్ ఆక్రమణదారుడు

By

Published : Feb 25, 2022, 1:35 AM IST

Updated : Feb 25, 2022, 7:09 AM IST

Biden on Russia: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి దిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్​ను ఆక్రమణదారుడిగా అభివర్ణించారు బైడెన్​. పుతిన్​ యుద్ధాన్ని ఎంచుకున్నారని అన్నారు.

ఈక్రమంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు బైడెన్. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం ఏకమైందని తెలిపారు.

" పుతిన్​ ఆక్రమణదారుడు. ఆయన చర్చలు యుద్ధాన్ని ఎంచుకున్నారు. అమెరికాపై రష్యా ఏమైనా సైబర్ దాడులు జరిపితే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నాటో దేశాలకు అమెరికా సైన్యాన్ని పంపించనున్నాం. యూరోప్ దేశాలకు ఇదొక ప్రమాదకరమైన చర్య. పుతిన్‌.. సోవియేట్‌ యూనియన్‌ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారు. అంతర్జాతీయ సమాజానికి పుతిన్‌ ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి.

-- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

జీ-7, ఈయూ కూటమి దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాలని సూచనలు చేశారు బైడెన్. పుతిన్​పైనా ఆంక్షలు విధిస్తారా అన్న ప్రశ్నకు.. ఆ విషయంపై చర్చిస్తున్నామని బైడెన్​ తెలిపారు. ప్రస్తుత ఆంక్షలు అమెరికాపై తాత్కాలికంగా ప్రభావం చూపినా.. రష్యా ఆర్థికవ్యవస్థపై దీర్ఘకాలికంగా ప్రభావం ఉంటుందని అన్నారు.

భారత్‌తో సంప్రదింపులు..

పుతిన్​తో మాట్లాడే ఆలోచన లేదని బైడెన్ తెలిపారు. తాజాగా.. వీటీబీతో సహా మరో 4 రష్యన్‌ బ్యాంకులపై ఆంక్షలు విధించామన్నారు. ఉక్రెయిన్‌ అంశంపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని బైడెన్​ తెలిపారు.

నాటో అత్యయిక సమావేశం..

ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మిలిటరీ ఆపరేషన్‌కు ఆదేశించిన నేపథ్యంలో నాటో(నార్త్‌-అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ప్రతినిధులు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్‌, రష్యా పొరుగున ఉన్న సభ్య దేశాల్లో రక్షణను బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నాటో సమ్మిట్‌కూ సన్నాహాలు జరుగుతున్నాయి.

'రష్యా దాడి.. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే. యూరో- అట్లాంటిక్ భద్రతకు తీవ్రమైన ముప్పు' అని నాటో జనరల్ సెక్రటరీ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు మిత్ర దేశాలు సమావేశమవుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో ఉక్రెయిన్ ప్రజలకు అండగా ఉంటామని.. తమ తరఫున చేయాల్సిందంతా చేస్తామని చెప్పారు.

మరోవైపు ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్ దేశాలు.. నాటో వ్యవస్థాపక ఒప్పందంలోని 'ఆర్టికల్- 4' కింద సంప్రదింపులు ప్రారంభించాయి. ఏదైనా నాటో దేశపు ప్రాంతీయ సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యం, భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు పరస్పర సంప్రదింపులకు ఈ ఆర్టికల్‌ అవకాశం కల్పిస్తుంది.

ఐక్యతే.. రష్యా దూకుడుకు దీటైన ప్రతిస్పందనని ఎస్తోనియా ప్రధాన మంత్రి కాజా కల్లాస్ ట్వీట్ చేశారు. రష్యా తీరు అన్ని నాటో దేశాలకు, మొత్తం ప్రపంచానికే ముప్పు అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత.. నాటో ఈశాన్య ఐరోపాలోనూ తన సామర్థ్యాన్ని పెంచుకోవడం ప్రారంభించింది.

40 వేల మంది సైనికులు కలిగిన నాటో రెస్పాన్స్ ఫోర్స్‌ను ఇప్పటికే అప్రమత్తం చేశారు. అమెరికా సైతం తన 8,500 మంది బలగాలను అలర్ట్‌ చేసింది.

ఇదీ చూడండి:'పుతిన్‌' మొదటి నుంచి ఇంతే.. ఇప్పుడు ఉక్రెయిన్‌ విషయంలోనూ..

Last Updated : Feb 25, 2022, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details