ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్న అధ్యక్షుడు బైడెన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డుల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా చట్టబద్ధ వలసలను నిలిపివేయడం వల్ల అమెరికాకు ప్రయోజనం చేకూరదని బైడెన్ తెలిపారు.
"వలసదారులను, గ్రీన్‌కార్డ్ ఉన్న వారి బంధువులను దేశంలోకి రానీయకుండా అడ్డుకోవడం వల్ల అమెరికాకు వచ్చిన లాభం ఏమీ లేదు. అందుకు భిన్నంగా ఆ చర్య వల్ల అమెరికాకే నష్టం. విదేశాలకు చెందిన వారి సేవలను వినియోగించుకుంటున్న పరిశ్రమలకు అది తీరని నష్ట కలిగిస్తుంది."
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు