Biden Kamala running mate: 2024 ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్నే ఎంచుకుంటానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కమలా హారిస్ పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారా అనే ప్రశ్నకు అవును అని సమాధానమిచ్చారు. 'ఆమె పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నా. నా తదుపరి ఉపాధ్యక్ష అభ్యర్థి కూడా ఆమెనే. ఓటింగ్ హక్కుల విషయంలో ఆమెను నేనే ఇంఛార్జిగా నియమించా. ఆమె బాగా పనిచేస్తున్నారు' అని బైడెన్ వివరించారు.
US First female vice president
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన తొలి మహిళా, నల్లజాతి, భారతీయ అమెరికన్ కమలా హారిసే కావడం విశేషం. భారత్, జమైకా దేశాలకు చెందిన తల్లిదండ్రులకు కమల జన్మించారు. కాలిఫోర్నియాలోని బెర్క్లీలో పెరిగారు. 2019 ఆగస్టులో జో బైడెన్.. తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలను ఎన్నుకున్నారు. 2020 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇరువురూ ఘన విజయం సాధించారు.
China US trade war
మరోవైపు, చైనా ఎగుమతులపై విధించిన సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా లేనని జో బైడెన్ స్పష్టం చేశారు. సుంకాలు తగ్గించాలని అమెరికా వ్యాపారుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యపై సమాలోచనలు చేస్తున్నామని, అయితే ప్రస్తుతానికైతే పరిస్థితి అనిశ్చితితో కూడుకొనన్నదని బైడెన్ పేర్కొన్నారు. ట్రంప్ హయాంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలోని వాగ్దానాలను చైనా నెరవేర్చితే.. కొన్ని ఆంక్షలను ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే పరిస్థితి అంతవరకు రాలేదని చెప్పారు.