ఈ నెల 20న జరగనున్న అధ్యక్షుడి ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయితే బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న ఈ కార్యక్రమానికి థీమ్‌గా 'అమెరికా యునైటెడ్'ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ వార్తా సంస్థకు వెల్లడించింది ప్రెసిడెన్షియల్ ఇనాగ్యురల్ కమిటీ. అమెరికా ఆత్మను పునరుద్ధరించి, దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, భవిష్యత్తుకు బాట వేయాలన్న బైడెన్ లక్ష్యాన్ని ఈ థీమ్ ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
అమెరికా ఐకమత్యంతో ఉండాలని బైడెన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయితే ఇటీవల జరిగిన క్యాపిటల్ హింసతో ఈ నినాదానికి మరింత ప్రాముఖ్యం పెరిగింది.
సైనికులకు నివాళి..
అమెరికా యునైటెడ్‌లో భాగంగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలసి.. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పిస్తారు బైడెన్. ఆ సమయంలో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్లు అక్కడే ఉంటారు. ఫలితంగా అధికారిక కార్యక్రమాలన్నీ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని కమిటీ తెలిపింది.