ప్రపంచవ్యాప్తంగా సిక్కులు గురునానక్ 551వ జయంతిని ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అమెరికా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు గురునానక్ దేవ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. గురునానక్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గం ప్రజలు, దేశ అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు.
" ఆధ్యాత్మికత, మానవసేవ, నైతికత వంటి అంశాలపై గురునానక్ బోధనలు గత ఐదు శతాబ్దాలుగా ప్రజలను సన్మార్గంలో నడిపిస్తున్నాయి. ప్రస్తుత విపత్తు సమయంలో అది స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా వైరస్ పోరులో ముందుండి సేవలందిస్తోన్న సిబ్బందికి మద్దతుగా నిలవటం, తమ గురుద్వారాల ద్వారా అన్నార్థుల ఆకలి తీర్చుతున్న అమెరికాలోని సిక్కులకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. "
- బైడెన్, హారిస్ సంయుక్త ప్రకటన