ఇప్పటివరకు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఓ ఎత్తు.. నవంబర్ 3న జరగనున్న ఎన్నికలు మరో ఎత్తు. నిరుద్యోగం, పర్యావరణ మార్పులతో విలవిల్లాడుతున్న అమెరికన్లపై కరోనా పిడుగు పడింది. అగ్రరాజ్య చిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ట్రంప్ వైఫల్యాలను తాను సరిదిద్దుతానని హామీలిస్తున్నారు. మరి బైడెన్‌కు ఇది సాధ్యమేనా? అధ్యక్షుడిగా గెలిచి శ్వేతసౌధంలో అడుగుపెడితే.. సవాళ్లను ఎదుర్కొనేందుకు బైడెన్ సిద్ధంగా ఉన్నారా?
అదే అతిపెద్ద సవాల్..
అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది శ్వేతసౌధంలో అడుగుపెడితే.. బైడెన్‌కు ముందుగా ఎదురయ్యేవి 'కరోనా' సవాళ్లే. వాటిని పరిష్కరించేందుకు చాలా సమయం గడిచిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఆ పరిస్థితులకు తాను సిద్ధంగా ఉన్నానని బైడెన్ అంటున్నారు. సమస్యల ముందు తలవంచనని తేల్చిచెబుతున్నారు.
కరోనా సంక్షోభంపై ట్రంప్ విధానాలకు భిన్నంగా ఉన్నాయి బైడెన్ ప్రణాళికలు. శాస్త్రవేత్తలపై ట్రంప్ విమర్శల వర్షం కురిపిస్తుంటే.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. ఆంటోనీ ఫౌచీని సంప్రదిస్తానని బైడెన్ అంటున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మాస్కుల వినియోగాన్ని తప్పని సరి చేస్తానని ప్రకటించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వచ్చే ఏడాది జనవరిలో కొత్త బిల్లును తీసుకొస్తానని తెలిపారు.
ఇదీ చూడండి:-ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజా మద్దతు బైడెన్ కే!
'ఎమర్జెన్సీగా పరిగణిస్తాం'
కరోనాతో మూతపడ్డ పాఠశాలలను తెరిచే విషయాన్ని జాతీయ ఎమర్జెన్సీగా పరిగణిస్తానని బైడన్ తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ 30 బిలియన్ డాలర్ల సహాయం చేయాలన్నారు. దీనితో పాటు పరిశ్రమలకు ఊతమివ్వడం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం 700 బిలియన్ డాలర్ల ప్రణాళికను ప్రతిపాదించారు బైడెన్.