అఫ్గానిస్థాన్ నుంచి బలగాలు, ఇతర వ్యక్తుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని, ఈ ప్రక్రియను ఇంకా ఆలస్యం చేసే ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు(Biden Afghanistan) లేదని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా జాతీయ భద్రతా బృందంతో చర్చించిన అనంతరం బైడెన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు.
అఫ్గాన్‌లో అమెరికా వాసులపై ఉగ్రముప్పు ఉందని భావిస్తోన్న తరుణంలో బైడెన్.. తరలింపు ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. అయితే.. ఆగస్టు 31లోగా తరలింపు పూర్తి కాని నేపథ్యంలో ప్రత్యామ్నాయం కూడా ఆలోచించాలని రక్షణ అధికారులకు సూచించారు. ఇప్పటికే అమెరికా తరలింపు ప్రక్రియను వేగవంతం చేసిందని పేర్కొన్నారు.
విదేశీయులందరినీ, అఫ్గాన్‌లో తాలిబన్ల ముప్పు ఉన్న వారిని తప్పకుండా తరలించే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని ఐరోపా మిత్ర దేశాలు, అమెరికా ప్రజాప్రతినిధులు కొందరు, ప్రముఖ సంస్థలు, శరణార్థుల సంఘాలు బైడెన్‌ను కోరుతున్నాయి.
పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ కూడా.. బలగాల ఉపసంహరణకు అనుకున్నదానికన్నా సమయం ఎక్కువే పట్టొచ్చని తెలిపారు. కాబుల్ నుంచి సామాగ్రి, బలగాలను తరలించడానికి మరికొన్ని రోజులు కావాలని అన్నారు.
మరోవైపు ఆగస్టు 31లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని తాలిబన్లు(taliban news) తేల్చిచెప్పారు. గడువు పొడిగించాలని అగ్రరాజ్యం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు ప్రకటన చేశారు.