ఇండో పసిఫిక్ తీరంలో సంఘర్షణ నిరోధానికే ఆ ప్రాంతంలో శక్తిమంతమైన సైన్యాన్ని ఉంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అక్కడున్న భారీ సైనిక శక్తి యుద్ధం కోసం కాదని, యుద్ధ నివారణకేనని చెప్పారు. అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన బైడెన్.. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సందేశం ఇచ్చినట్లు తెలిపారు. తాము పోటీతత్త్వాన్ని ఆహ్వానిస్తామని అంతేకానీ, యుద్ధ వాతావరణాన్ని కాదని బైడెన్ ఉద్ఘాటించారు.
అమెరికన్ల ప్రయోజనాలను కాపాడి తీరుతామని తేల్చి చెప్పారు బైడెన్. అమెరికా సంస్థలకు నష్టం చేకూర్చేలా, అమెరికన్ల ఉద్యోగాలు కోల్పోయేలా చేసే ఏ విధమైన వాణిజ్య పంథాను సహించేది లేదని చైనాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనపై, ప్రజల స్వాతంత్ర్యానికి సంబంధించి ఇతర దేశాధినేతలకు చెప్పినట్లే జిన్‌పింగ్‌కు కూడా తేల్చి చెప్పినట్లు బైడెన్ వివరించారు. ఏ దేశంలోనైనా మనుషుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంటే ఏ అమెరికా అధ్యక్షుడు కూడా సహించబోరని అన్నారు.
అమెరికన్ల కోసం ఉద్యోగ ప్రణాళిక
చైనాతో పోటీని ఎదుర్కొంటున్నామని చెప్పిన బైడెన్.. దేశీయ పెట్టుబడులు పెట్టడమే ఆ దేశంపై విజయం సాధించడానికి మార్గమని అన్నారు.