తెలంగాణ

telangana

'బైడెన్​జీ.. ఆ విషయంలో భారత్​కు మద్దతివ్వండి'

By

Published : Mar 18, 2021, 9:45 AM IST

కరోనా టీకాల ఉత్పత్తి పెంచేందుకు నిబంధనల సడలింపుపై ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత్ చేసిన అభ్యర్థనకు మద్దతు ఇవ్వాలని జో బైడెన్​ను కోరారు ఆ దేశ చట్ట సభ్యులు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించిన ఈ ప్రతిపాదనను.. బైడెన్ స్వాగతించి అమెరికా ప్రతిష్ఠను కాపాడాలని పేర్కొన్నారు.

Biden called upon to support India, South Africa at WTO on COVID-19 vaccines
'బైడెన్.. ఆ విషయంలో భారత్​కు మద్దతివ్వండి'

కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు 'వర్తక సంబంధిత మేధో సంపత్తి హక్కుల'(ట్రిప్స్) నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో భారత్ చేసిన అభ్యర్థనకు మద్దతివ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ను ఆ దేశ చట్టసభ్యులు కోరారు. ఈ మేరకు చట్ట సభ్యులు రోసా డెలారో, జన్ షాకోవ్స్కీ, ఇయార్ల్ బ్లమెనార్, లాయిడ్ డగెట్, అడ్రియానో ఎస్పైల్లాట్, ఆండీ లెవిన్... అధ్యక్షుడు బైడెన్​కు విజ్ఞప్తి చేశారు.

ట్రంప్ సర్కార్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేసే అవకాశం బైడెన్ చేతిలో ఉందని డెలారో పేర్కొన్నారు. ప్రజారోగ్య రంగంలో అమెరికాకు ఉన్న అంతర్జాతీయ ప్రతిష్ఠను తిరిగి తీసుకురావాలని అన్నారు. భారత్ చేసిన ప్రతిపాదనకు 60 మందికి పైగా చట్టసభ్యులతో బైడెన్​కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

ట్రంప్ వ్యతిరేకం

ట్రిప్స్ ఒప్పందంలోని నిబంధనలను స్వల్పకాలానికి నిలిపివేయాలని భారత్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాలు డబ్ల్యూటీఓను అభ్యర్థించాయి. టీకా ఉత్పత్తి సహా.. చికిత్స, పరీక్షల విషయంలో కొద్ది కాలం పాటు ఈ నిబంధనలకు మినహాయింపు ఇవ్వాలని కోరాయి. ఈ ప్రతిపాదనను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించారు.

ట్రిప్స్ నిబంధనలు మాఫీ చేయడం ద్వారా వ్యాక్సిన్ తయారీ సంస్థలకు.. సంబంధిత సాంకేతికతను నేరుగా అందించే అవకాశం ఉంటుంది. వాణిజ్య ఆంక్షలు, అంతర్జాతీయ వివాదాలతో సంబంధం లేకుండా.. వేగంగా టీకాల ఉత్పత్తి సాధ్యమవుతుంది.

ఇదీ చదవండి:కమలా హారిస్​ ఇంటి వద్ద సాయుధుడి కలకలం- అరెస్టు

ABOUT THE AUTHOR

...view details