అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించడంపై జో బైడెన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పని పక్కనబెట్టి ఫిర్యాదులు చేయడం కూనిరాగాలు తీయడంతోనే ట్రంప్ కాలం వెళ్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన పని చేయడానికి ఇష్టంగా లేరని, అయినా ఆ పదవిని ఎందుకు కోరుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. జార్జియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. దేశం కోసం అన్నింటినీ వదులుకున్న ప్రజల కోసం ఏదైనా చేయాలని హితవు పలికారు.
"తమ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజల గురించి ఆలోచించండి. దేశం కోసం ఏదైనా చేయండి. దేశ భవిష్యత్తు నిర్మించేందుకు పని చేయండి. ప్రపంచవ్యాప్తంగా మనలా స్వేచ్ఛను కోరుకునే ప్రజల కోసం చేయండి. సమస్యలపై పోరాడటం కాకుండా.. ఫిర్యాదులు చేయడానికే అధ్యక్షుడు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు."
-జో బైడెన్, అమెరికా తదుపరి అధ్యక్షుడు
మరోవైపు, అమెరికా ప్రజాస్వామ్య ప్రాథమిక సిద్ధాంతాలపై దాడి జరుగుతోందని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. అధికారం నిలబెట్టుకోవడానికి కొందరు ఎంతదూరమైనా వెళ్లేందుకు వెనకాడట్లేదని.. పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజాస్వామ్యం ఏ ఒక్క వ్యక్తికో, అధ్యక్షుడికో సంబంధించినది కాదని అన్నారు.