చైనాకు మరోమారు గట్టి హెచ్చరికలు పంపింది అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం. దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్ చేస్తున్న వాదనలను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరినే సమర్థించింది.
ఫిలిప్పీన్స్ జోలికి రావొద్దు..
ఫిలిప్పీన్స్‌పై దాడికి దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది అగ్రరాజ్యం. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో అలాంటి చర్యలకు పాల్పడితే అమెరికా జోక్యం తప్పదని తేల్చి చెప్పింది. ఫిలిప్పీన్స్‌తో ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం ప్రకారం చర్యలుంటాయని స్పష్టంచేసింది.
స్ప్రాట్లీ దీవులు, పొరుగున ఉన్న దిబ్బలపై చైనా వాదనలకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా వచ్చిన అంతర్జాతీయ ట్రైబ్యూనల్ తీర్పునకు ఐదేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.