కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం వల్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దేశంలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. ఇప్పటివరకు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారు ముందుకొచ్చేలా నగదు రివార్డులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ రేటు మరింతగా పెంచేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఉపకరిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. క్రొగెర్ గ్రోసరీ స్టోర్ కూడా ఇలాంటి ప్రయత్నం చేయగా ఆ సంస్థ ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్ రేటు 50శాతం నుంచి 75శాతానికి పెరిగిందని శ్వేతసౌధం పేర్కొంది. అలాగే, న్యూ మెక్సికో, ఒహైయో, కొలరాడోలలోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాలు/ప్రాంతాలు తమ కొవిడ్ ఉపశమన చట్టం నుంచి నిధులు ఖర్చు చేయవచ్చని బైడెన్ సూచించారు.
టీకాలు వృథా అవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ఎక్స్పైరీ డేట్‌ను పొడిగిస్తున్నట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు. వ్యాక్సిన్ల నిల్వకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరు నెలల వరకు అవి సురక్షితం సహా ప్రభావితంగా కూడా ఉంటాయని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతం చేసేందుకు రాష్ట్రాలు చర్యలను వేగవంతం చేశాయి.