అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి నవంబర్ 8 నుంచి అమలు చేయనున్న నిబంధనల (US Travel restrictions) జాబితాను బైడెన్ ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నియమాలను (US Travel advisory) వెలువరించింది.
రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులనే నవంబర్ 8 నుంచి అమెరికాలోకి (US International Travel news) అనుమతించనున్నారు. వీరంతా విమానంలో ఎక్కేముందే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా ఎఫ్డీఏ ఆమోదించిన టీకాలతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతులు జారీ చేసిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి అమెరికాలోకి ప్రవేశం ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. అనుమతించిన మిక్సింగ్ టీకాలను తీసుకున్నా.. ప్రయాణాలు చేయవచ్చు.
టీకా తీసుకున్నప్పటికీ.. ప్రయాణానికి ముందు కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని (US Travel docs) సమర్పించడం తప్పనిసరి కానుంది. మూడు రోజుల లోపు పరీక్షించిన నమూనా ఫలితాలనే సమర్పించాలి. ఈ నిబంధన విదేశీ ప్రయాణికులతో పాటు అమెరికా పౌరులకు, చట్టబద్ధమైన శాశ్వత నివాసులకూ వర్తిస్తుంది.