హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఊరట కల్పించారు. ఈ మేరకు గతంలో.. హెచ్4 వీసాదారుల పని అనుమతులను రద్దు చేసేలా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వలస విధానాన్ని ఉపసంహరించుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారానికే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు బైడెన్.
హెచ్-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు(జీవిత భాగస్వామి సహా.. 21 ఏళ్లలోపు పిల్లలు) అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ(యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్-యూఎస్‌సీఐఎస్) హెచ్4 వీసాలు జారీ చేస్తుంది. అయితే.. తొలుత హెచ్4 వీసాదారులు అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండని కారణంగా.. హెచ్-1బీ వీసాదారులపై అధిక ఆర్థికభారం పడేది.