అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా భారత్ సహా దక్షిణాసియా దేశాల మద్దతును పొందేందుకు రిపబ్లికన్లు- డెమొక్రాట్లు తమ ఎన్నికల ప్రచారాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. తాము అధికారంలోకి వస్తే దక్షిణాసియాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ యంత్రాంగం ఉద్ఘాటించింది. ముఖ్యంగా దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించబోమని తేల్చిచెప్పింది.
భారత్తో తమ బంధాన్ని మరింత దృఢ పరుచుకునేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది బిడెన్ వర్గం. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరివైపు నిలబడాలనే అంశాన్ని నిర్ణయించేందుకు హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వేసిన పలు ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చింది.
"భారత్- అమెరికాల బంధం సహజమైనదని మేము విశ్వసిస్తున్నాం. ఒబామా పాలనలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్-అమెరికాలు కలిసి పనిచేశాయి. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే.. ఈ విధానాన్నే కొనసాగించేందుకు బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది."