నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజలను ఓట్లు అడుగుతూ.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజా డెమెుక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ వయస్సు, ఆరోగ్య పరిస్థితిపై పలు వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలో రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించటానికి తాను సిద్ధం ఉన్నట్లు వెల్లడించారు బైడెన్.
అధ్యక్షుడిగా పూర్తి కాలంపాటు కొనసాగుతారా? అని ఏబీసీ న్యూస్ అడిగిన ప్రశ్నకు "కచ్చితంగా కొనసాగుతాను" అని సమాధానం ఇచ్చారు బైడెన్. '70 ఏళ్ల పైబడిన వారిని ఆరోగ్య ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్న అడగటం సమంజసమే'నని వివరణనిచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ తన ఆరోగ్యంపై చేసిన విమర్శలపై సమాధానం చెబుతూ 'నేను సిద్ధంగా ఉన్నాను' అని ముక్త కంఠంతో తెలిపారు.