పరారీలో ఉన్న భారత వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కిడ్నాప్‌లో తన పాత్ర ఏమీ లేదని అయన ప్రియురాలిగా భావిస్తున్న బార్బరా జబరికా చేసిన వ్యాఖ్యలను వ్యాపారవేత్త భార్య ప్రీతీ చోక్సీ ఖండించారు. మెహుల్ తనను తాను 'రాజ్' అనే పేరుతో పరిచయం చేసుకన్నాడని బార్బరా చెప్పటం.. పూర్తిగా అవాస్తవమని చెప్పారు. 'పిల్లలు కూడా గూగుల్ వాడుతున్న ఈ కాలంలో మెహుల్ చోక్సీని బార్బరా గుర్తుపట్టలేకపోయిందా?' అని ప్రశ్నించారు. తనతో మెహుల్ చోక్సీ వాట్సాప్ సంభాషణలు జరిపాడని బార్బరా చెప్పటంపై కూడా ప్రీతీ చోక్సీ తప్పుబట్టారు. ఫొటోషాప్ వంటి సాఫ్ట్వేర్ సాయంతో వాట్సాప్ సందేశాలను ఎవరైనా మార్చగలరన్నారు.
"ఈ కేసు చుట్టూ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది అనుచరులు ఉన్న ఆమె(జబరికా)కు ఈ వార్తల గురించి తెలియదా? మెహుల్ చోక్సీతో స్నేహం మాత్రమే చేశానని చెబుతున్న ఆమె.. ఎందుకు మరి తన స్నేహితున్ని కాపాడటానికి ఒక్క మాట మట్లాడలేదు. నా భర్త చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. అవన్నీ అసత్యపూరితమైనవేనని ఎవరికైనా అర్థం అవుతుంది. తన గౌరవాన్ని పణంగా పెట్టి సదరు మహిళ గురించి మెహుల్ చోక్సీ ఎందుకు తప్పుడు సమాచారాన్ని ఇస్తారు? జబరికా ఆరోపణలన్నీ నా భర్తను తప్పుగా చూపించడానికి జరుగుతున్న కుట్రలే."
- ప్రీతీ చోక్సీ, మెహుల్ చోక్సీ భార్య
జబరికాగా అందరూ పిలుస్తున్న ఆమె.. ఇంతవరకు తాను ఎక్కడుంటారోనన్న వివరాలు వెల్లడించలేదని ప్రీతీ చోక్సీ విమర్శించారు. అంతకుముందు.. ఆంటిగ్వా పోలీసులుగా చెప్పుకొంటున్న బలమైన వ్యక్తులు తనపై దాడి చేసి కొడుతుంటే జబరికా అడ్డుకోలేదని మెహుల్ చోక్సీ చెప్పారు. తనను జబరికా ట్రాప్ చేసిందని తెలిపారు.