డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా మొదటిసారి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా రానున్నారు. డెమొక్రటిక్ పార్టీలో మంచి వక్తగా పేరొందిన ఒబామా.. కరోనా నేపథ్యంలో 'డ్రైవ్ ఇన్ కార్ ర్యాలీ' నిర్వహించనున్నారు.
అమెరికా ఎన్నికల్లో విజయానికి పెన్సిల్వేనియా కీలక రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడ ఒబామా పోటీలో ఉన్న 2008, 2012లో డెమొక్రాట్లే విజయం సాధించారు. గత ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి ట్రంప్ కన్నా బైడెన్ ముందంజలో ఉన్నట్లు వస్తోన్న వార్తల నడుమ రాష్ట్రంలో గెలుపు తమదేనని డెమొక్రాట్లు ధీమాగా ఉన్నారు.
అదే వేదికగా..
2016 ఎన్నికల ముందు రోజు ఇదే ఫిలడెల్ఫియాలోని 'ఇండిపెండెన్స్ మాల్'లో అప్పటి అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రచార ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఒబామా. మళ్లీ అదే నగరంలో బైడెన్ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.