ప్రతి విషయంలోనూ ఉప్పు-నిప్పుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లు ఒక విషయంలో మాత్రం ఏకతాటిపై నిలబడతారు! ఆగర్భ శత్రువుల్లా అధ్యక్ష పదవికి పోరాడుతున్న ఈ ఇద్దరినీ కలుపుతోంది- మందు! అలాగని ఇద్దరూ మందు మిత్రులనుకుంటే పొరపాటు. ఇద్దరూ మద్యానికి ఆమడదూరమే. కానీ, కారణాలు దాదాపు ఒకేలా ఉండటం విశేషం.
తన పెద్దన్న ఫ్రెడ్ కారణంగా ట్రంప్ మందుకు దూరమైతే, తాను ఆదర్శంగా భావించిన దగ్గరి బంధువొకరు తాగుడుకు బానిస కావటం చూసి ఏహ్య భావంతో మందును వద్దనుకున్నారు బైడెన్! ప్రతిరోజూ కచ్చితంగా ఇంటికి వెళ్లేలా బైడెన్ తన షెడ్యూల్‌ను రూపొందించుకుంటే.. టీవీ చూస్తూ గడపటానికి ట్రంప్ ప్రాధాన్యం ఇచ్చేవారు. అలా ఇద్దరూ మందుకు దూరంగా ఉండేలా ప్రాధమ్యాలను మార్చుకున్నారు. మందు తాగేందుకు అవసరమైన సమయం లేకుండా వారు తమ జీవితాలను మలచుకున్నారని బైడెన్ జీవితకథా రచయిత ఇవాన్ ఓస్నోస్ చెబుతారు.
" మా పెద్దన్న ఫ్రెడ్ చాలా మంచి మనిషి. కానీ మందుకు బానిసై.. దాని కారణంగానే చనిపోయారు. అప్పట్నుంచి నేనెన్నడూ మందు ముట్టనని నిర్ణయించుకున్నా. నా పిల్లలకు కూడా రోజూ అదే నూరిపోస్తుంటా! మాదక ద్రవ్యాలు, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉంటా. మందు విషయంలో నా పిల్లలతో చాలా కఠినంగా వ్యవహరిస్తా" అని ట్రంప్ తెలిపారు.
"సమావేశాలు, వ్యాపార సదస్సులు, ఒప్పందాలకు వెళ్ళినా ట్రంప్ ఎంతో నిగ్రహంతో ఉంటారు. అంతా తాగుతుంటే తాను మాత్రం వ్యాపారం చక్కబెట్టుకుంటారు. ఎవ్వరేమన్నా పట్టించుకోరు. రాత్రి ఇంట్లో టీవీ చూస్తూ బర్గర్ తింటూ గడుపుతారు"
-ఓబ్రెయిన్, రచయిత(ట్రంప్ జీవిత కథ రాశారు).
ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి మైక్ పెన్స్ కూడా మందుకు దూరమే. డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఈ ముగ్గురికీ భిన్నం!
ఇదీ చదవండి:'బైడెన్ నా సోదరుడు'- 'ట్రంప్ ఓ యోధుడు'
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ట్రంప్, బైడెన్‌లు విమర్శల పదును పెంచుతున్నారు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
బైడెన్ రాజకీయజీవితం అవినీతిమయం
ఎన్నికల గడువు సమీపించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి జో బైడెన్‌పై ఆరోపణలు తీవ్రతరం చేశారు. బైడెన్ లంచగొండి రాజకీయ నాయకుడని, 47 ఏళ్లుగా అమెరికన్లకు నమ్మకద్రోహం చేస్తున్నారన్నారు. శుక్రవారం మిన్నెసోటాలోని రోచస్టర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. బైడెన్‌కు అధికార యావ తీవ్రంగా ఉందని, ఇందుకోసం ఎవరినైనా వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడని విమర్శించారు.
'మీ కుటుంబాన్ని, దేశాన్ని రక్షించుకొనేందుకు. అమెరికా జీవనశైలిని సంరక్షించుకొనేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. నవంబరు 3న మీరంతా ఓటు వేయడమే ఆ మార్గం. బైడెన్‌ను ఓడించి అమెరికా స్వాతంత్య్రాన్ని కాపాడండి' అని ట్రంప్ కోరారు.
బైడెన్ గత 47 ఏళ్లుగా రాజకీయాల్లో అఫ్రికన్-అమెరికన్లను దారుణంగా మోసం చేస్తున్నారని, వాళ్లని సూపర్ ప్రిడేటర్లుగా పిలుస్తూ అవమానించారన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు మధ్య తరగతి అఫ్రికన్-అమెరికన్లను తుడిచిపెట్టాలన్న లక్ష్యంతోనే పనిచేశారని ఆరోపణలు చేశారు. వ్యాక్సిన్ రావడాన్ని ఆలస్యం చేసి, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి దేశాన్ని షట్ డౌన్ చేయాలన్నదే బైడెన్ ప్రణాళికలా ఉందన్నారు.