తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2020, 2:39 PM IST

ETV Bharat / international

పోర్టబుల్ వెంటిలేటర్... కరోనాపై యుద్ధంలో సరికొత్త అస్త్రం!

కరోనా వైరస్​పై పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం అధునాతన వెంటిలేటర్​ కనిపెట్టింది. చేతిలో తీసుకెళ్లగలిగేంత చిన్నదిగా ఉండి, ఆటోమేటిక్​గా పనిచేయడం దీని ప్రత్యేకత.

Automatic, hand-held and inexpensive breathing ventilator developed by Texas university to combat the pandemic
కరోనాపై యుద్ధానికి అమెరికా అధునాతన వెంటిలేటర్​

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​ ఉద్ధృతి పెరుగుతోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంటే.. వారికి అత్యవసరమైన వెంటిలేటర్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. భారత్​లో పరిస్థితి కాస్త అదుపులో ఉన్నా.. అమెరికాలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎక్కువ మొత్తంలో వెంటిలేటర్లు ఉత్పత్తికి సమయం పట్టనుంది. వాటి తయారీకి ఎక్కువగా ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో సమస్యలన్నింటీకీ చెక్​ పెడుతూ ఓ కొత్త పరికరాన్ని ఆవిష్కరించింది అమెరికాలోని టెక్సాస్​కు చెందిన ఓ విశ్వవిద్యాలయం

తక్కువ ధరలోనే...

తక్కువ ధరలో వెంటిలేటర్​ తయారుచేసేందుకు ఇప్పటికే చాలా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ వెంటిలేటర్​కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతుందని అంచనా. మరింత అత్యాధునిక సాంకేతికత జోడిస్తే వాటి ధర రూ.40 లక్షలు దాటిపోతోంది. ఇలాంటి సమయంలో టెక్సాస్​లోని రైస్​ యూనివర్సిటీ, కెనడాకు చెందిన మెట్రిక్​ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌(బీవీఎమ్​) తరహా వెంటిలేటర్​ను రూపొందించారు. వీటి తయారీకి 300 అమెరికా డాలర్లు (దాదాపు రూ.22 వేల 600) ఖర్చు మాత్రమే అయినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌(బీవీఎమ్​) వెంటిలేటర్​

చేతులతో పట్టుకెళ్లవచ్చు..

సాధారణ వెంటిలేటర్లను పెట్టడానికి ఆసుపత్రుల్లో స్థలం సమస్యగా మారడమే కాకుండా వాటిని ఒక దగ్గర నుంచి వేరే చోటకు మార్చడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నింటికీ చెక్​ పెట్టిందీ పరికరం. వాల్వ్​ మాస్క్​ వెంటిలేటర్..​ బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ స్వీయ నియంత్రణ చేసుకోగలదు. అంతేకాకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు చేతులతో మోసుకెళ్లగలిగే పరిమాణంలో ఉండటం వల్ల వీటిపై ఎక్కువగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడే బాధితులకు ఈ పరికరం ఉపశమనం కలిగించనుంది.

సాధారణ వెంటిలేటర్​

కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో ఇవి అందుబాటులోకి వస్తే.. వెంటిలేటర్ల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ డిజైన్​ను అన్ని దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం శ్వాసకోస ఇబ్బందులకు మాత్రమే ఇది ఉపయోగపడనుందని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది పనిచేయదని తయారీదారులు చెప్పారు. ఈ పరికరాన్ని అమెరికా డిఫెన్స్​ విభాగం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోందని.. త్వరలో అనుమతి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్​లో మహీంద్రా గ్రూప్​ రూ.7,500కే వెంటిలేటర్!

కరోనా పోరులో తనవంతు సహకారం అందిస్తామని ముందుకొచ్చిన మహీంద్రా గ్రూప్‌.. భారత్​లో ఈ తరహా వెంటిలేటర్​ తయారీ కోసం తొలి అడుగు వేసింది. అంబు బ్యాగ్‌గా పిలిచే ఆటోమేటెడ్‌ వెర్షన్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌ నమూనాను రూపొందించామని, త్వరలో అనుమతి లభించే అవకాశం ఉందని ఇటీవలె మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. రూ.7,500కే వీటిని అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. ఈ పరికరం రూపొందించిన బృంద సభ్యులకు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇది అందుబాటులోకి వస్తే భారత్​లోనూ వెంటిలేటర్ల సమస్య తీరిపోనుంది.

ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మొత్తం 7,82,365 కేసులు నమోదవగా.. దాదాపు 37,500 మంది మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details