అరేబియా సముద్రం సహా.. బంగాళాఖాతంలో నవంబర్లో నౌకాదళ సంయుక్త విన్యాసాలు జరగనున్నాయి. చతుర్భుజ కూటమిలో భాగస్వామ్య దేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు ఇందులో పాల్గొంటాయని భారత్ ప్రకటించింది.
మలబార్ 2020 పేరిట జరిగే ఈ మెగా విన్యాసాల్లో తొలుత భారత్- అమెరికా- జపాన్లు మాత్రమే భాగస్వాములయ్యాయి. అయితే.. చతుర్భుజ కూటమిలో భాగస్వామి అయిన ఆస్ట్రేలియానూ కలుపుకోవాలని ఆ దేశం విజ్ఞప్తి చేయడం వల్ల.. దానికి అంగీకరించింది భారత్.
చైనాను తక్కువ చేసేందుకే..
చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దు వద్ద వివాదం కొనసాగుతున్న తరుణంలో జరగనున్న ఈ సైనిక విన్యాసాలు.. ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సముద్ర రక్షణ విభాగంలో మరింతగా భాగస్వామ్యం పెంచుకునే దిశగా చతుర్భుజ కూటమి దేశాల మధ్య ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా హవాను తక్కువచేసే ఉద్దేశంతోనే ఈ విన్యాసాలు జరుపుతున్నట్లు చైనా ఆక్షేపిస్తోంది.
1992 నుంచి మలబార్ విన్యాసాలు నిర్వహిస్తుండగా.. తొలుత భారత్- అమెరికాలే ద్వైపాక్షికంగా జరుపుకొన్నాయి. 2015 నుంచి జపాన్ కూడా భాగస్వామిగా చేరినందున త్రైపాక్షికంగా మారాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా భాగస్వామి అయ్యింది.
ఇదీ చదవండి:కాఫీ రేణువులతో పెయింటింగ్- గిన్నిస్ రికార్డ్