కరోనా మహమ్మారికి టీకా (వ్యాక్సిన్) అభివృద్ధి దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇందుకు జరిపే ప్రయోగ పరీక్షలకు అనువైన జంతువుగా ఫెర్రెట్(ముంగిస వంటి క్షీరదం)ను గుర్తించారు. దీని శ్వాసకోశ వ్యవస్థ తీరుతెన్నులు అచ్చంగా మానవుల ఊపిరితిత్తులను పోలి ఉంటాయని తేల్చారు. కరోనా వైరస్ ఈ జీవికీ సోకుతుందని నిర్ధరించారు. కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సీఎస్‌ఐఆర్‌వో)లో ప్రమాదకరమైన సూక్ష్మజీవులపై పరిశోధన సాగిస్తున్న ఈ శాస్త్రవేత్తల బృందానికి భారత సంతతికి చెందిన వైరాలజీ నిపుణుడు, ప్రొఫెసర్ శేషాద్రి వాసన్ నేతృత్వం వహిస్తున్నారు.
ఫెర్రెట్లపై పరిశోధనల ద్వారా కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్ తీరుతెన్నులపై ఈ బృందం అధ్యయనం జరుపుతోంది. అమెరికా, బ్రిటన్, చైనాలో మొదటి దశ క్లినికల్ పరీక్షల్లో టీకాల సమర్థతను వీరు పరీక్షిస్తున్నారు. ఇందులో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, ఇనోవియో ఫార్మా సంస్థ రూపొందించిన రెండు టీకాలూ ఉన్నాయి. త్వరలోనే వీటిని మానవులపై పరీక్షించనున్నారు. అంతకుముందే ఈ టీకాలను జంతువులపై విజయవంతంగా పరీక్షించి చూడాలి. ఇలా ఏకకాలంలో అనేక టీకాలను జంతువులపై పరీక్షించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి.