ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ముకుతాడు వేసేందుకు క్వాడ్‌కు అదనంగా ఏర్పాటైన ఆకస్ కూటమిపై(aukus alliance) చైనా, ఫ్రాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కూటమి ఏర్పాటును తీవ్రంగా విమర్శించిన చైనా.. ఈ ఒప్పందాన్ని ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా, అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ చర్యలకు విఘాతంగా అభివర్ణించింది. కూటమి చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని చైనా విమర్శించింది. ఆస్ట్రేలియా అణ్వాయుధ దేశం కాదని.. ఇప్పుడు అణు జలాంతర్గామి తయారు చేయడానికి సిద్ధపడుతోందని తెలిపింది(aukus australia). ఇది అణు నిరాయుధీకరణ లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది(aukus china response). ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతాయని హెచ్చరించింది. చైనా ఎదురుదాడిలో చనిపోయేది ఆస్ట్రేలియా సైనికులే కావచ్చని చైనా ప్రభుత్వానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఆకస్ కూటమి ఒప్పందం క్రూరమైన ఏకపక్ష నిర్ణయమని ఫ్రాన్స్ ఆరోపించింది. ఈ నిర్ణయంతో వాషింగ్టన్‌లో హాజరవ్వాల్సి ఉన్న ఒక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ దౌత్యవేత్తలు రద్దు చేసుకున్నారు.
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ కలిసి ఆకస్ పేరుతో భద్రతా కూటమిగా ఏర్పడ్డాయి. బుధవారం జరిగిన వర్చువల్ సమావేశంలో.. ఆకస్ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ మూడు దేశాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ పాల్గొన్నారు. ఐతే ఎక్కడా చైనా పేరును ప్రస్తావించలేదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం ఈ మూడు దేశాలు తమ రక్షణ సామర్థ్యాలతో పాటు కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వనరులను పరస్పరం పంచుకోనున్నాయి(aukus pact). అణుశక్తితో నడిచే జలాంతర్గాముల తయారీలో ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్ సాయం చేయనున్నాయి. రక్షణ సంబంధింత శాస్త్ర, సాంకేతికత, పారిశ్రామిక స్థావరాలు, సరఫరా గొలుసులను బలోపేతం చేసేందుకు ఆమోదం తెలిపాయి. ఆకస్ కార్యాచరణను 18 నెలల్లో రూపొందించనున్నారు. అటు.. ఆకస్ కూటమిపై చైనా విమర్శలను అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తోసిపుచ్చారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంచాలని ఆస్ట్రేలియా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆకస్ కూటమి పట్ల సింగపూర్ విదేశాంగ మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందం అమెరికా-ఫ్రాన్స్ సంబంధాలపై ప్రభావం చూపబోదని, అసలు ఈ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని అమెరికా శ్వేతసౌధం తెలిపింది.