ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు అమెరికాకు వణుకుపుట్టించే పరిస్థితికి దారితీస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ కాన్ఫరెన్స్‌కు హాజరైన వ్యక్తికి కరోనా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాషింగ్టన్లో ఫిబ్రవరి 26-29 మధ్య జరిగిన 'కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్'లో ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో పాటు పలు కేబినెట్ మంత్రులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నట్లు శ్వేతసౌధ అధికారులు తెలిపారు.
న్యూ జెర్సిలోని ఓ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కాన్ఫరెన్స్ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ సమావేశంలో అగ్రరాజ్య అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో ఎటువంటి సంభాషణలు అతను జరపలేదని, అలాగే ముఖ్యమైన భేటీల్లో బాధితుడు పాల్గొనలేదని అధికారులు స్పష్టం చేశారు.
కరోనా సోకిన వ్యక్తితో తాను మాత్రం సంభాషించినట్లు చెప్పారు కాన్ఫరెన్స్ నిర్వహించిన సంస్థ ఛైర్మన్. తనకెలాంటి ఆందోళన లేదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ముందుకు సాగేందుకే సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు.